రెండు రోజులే ఏపీ బడ్జెట్ సమావేశాలు 

ఈ నెల 16న ప్రారంభం కానున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అసాధారణ రీతిలో కేవలం రెండు రోజులకే పరిమితం కానున్నట్లు తెలుస్తున్నది. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు గతంలో నెలరోజులకు పైగా జరిగేవి. అయితే ఈ మధ్య కాలంలో రెండు వారాలకు కుదిస్తున్నారు. 
 
అయితే ప్రష్టుతం నెలకొన్న కరోనా నేపథ్యంలో బాగా కుదిస్తున్నట్లు చెబుతున్నారు. పైగా, గతంలో ఎన్నడూ జరుగని విధంగా గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన రోజుననే బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.  ఆ మరుసటి రోజు ముగించి సమావేశాలను ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత మార్చ్ లోనే సమావేశాలు జరుగవలసి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. మూడు నెలలకు ఆర్డినెన్సు ద్వారా వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం పొందారు. ఈ బడ్జెట్ గడువు ఈ నెలాఖరుకు పూర్తవుతున్న దృష్ట్యా మరోసారి బడ్జెట్ ఆమోదం పొందవలసి ఉంది.
అందుగనే లాంఛనంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి, బడ్జెట్ కు ఆమోదం పొందాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు.  పైగా, ఆరు నెలల లోపుగా సమావేశాలు రాజ్యాంగం ప్రకారం జరుపవలసి ఉంది. ఇంతకు ముందు  చివరి సారిగా జనవరిలో సమావేశాలు జరిగాయి. అంటే జులై 22 లోపుగా సమావేశాలు జరుపవలసి ఉంది.
అందుకనే ఒక వంక బడ్జెట్ ఆమోదం, మరో వంక నిబంధనలు పాటించడం కోసం రెండు రోజులపాటు సమావేశాలు జరపనున్నారు. ఈ నెల 16న రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగంతో ప్రారంభం కానున్న సమావేశాలు ఆ తరువాత 17వ తేదీ మరొక్క రోజు మాత్రమే జరగబోతున్నట్లు తెలుస్తున్నది.
 తొలి రోజున ఉదయం 10 గంటలకు గవర్నర్‌ ‌ విజయవాడలోని రాజ్‌భవన్‌ నుంచే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ సౌకర్యం ద్వారా వెలగపూడిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది గంటసేపు  ఉండే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే ఆయా సభల బీఏసీ సమావేశాలు విడివిడిగా శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్, శాసన మండలి చైర్మన్‌ అహ్మద్‌ షరీఫ్‌ చాంబర్లలో జరుగుతాయి.
కార్యక్రమాల ఖరారుపై నిర్ణయం తీసుకున్న అనంతరం గంట సేపటికి ఉభయ సభలూ విడివిడిగా సమావేశమవుతాయి.
 వెంటనే గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. నిర్దేశిత, నియమిత సమయాలను కచ్చితంగా పాటిస్తూ పరిమితంగా సభ్యులను చర్చకు అనుమతిస్తారు. తీర్మానం ఆమోదించిన తరువాత ఉభయ సభల్లో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు.
వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ఆ వెంటనే ప్రతిపాదిస్తారు.
వెనువెంటనే చర్చ ప్రారంభమై సాధారణ బడ్జెట్‌ ఆమోదం పొందే అవకాశం ఉంది. ఆ మరుసటి రోజు అంటే.. 17వ తేదీన ప్రభుత్వం కొన్ని బిల్లులు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. అదే రోజున ఉభయ సభలూ దశల వారీగా ప్రభుత్వ శాఖల పద్దులను, ద్రవ్య వినిమయ బిల్లును కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండో రోజు సాయంత్రంలోపు ఈ తంతు అంతా పూర్తి కావాలని భావిస్తున్నారు.