పాక్‌లో ఇద్దరు భారత దౌత్యవేత్తలు అదృశ్యం

దాయాది దేశం పాకిస్థాన్ లో విధులు నిర్వర్తిస్తున్న భారత్‌కు చెందిన ఇద్దరు దౌత్యవేత్తలు అదృశ్యమయ్యారు. ఓ జాతీయ మీడియా ప్రచురించిన కథనం ప్రకారం.. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు రెండు గంటలుగా కనిపించడంలేదు. 
 
స్థానిక అధికారులు పాక్‌ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారి కోసం సిబ్బంది గాలిస్తున్నప్పటికీ ఆచూకీ ఇంకా లభ్యంకాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 
 
మరోవైపు ఇద్దరు దౌత్యవేత్తల మిస్సింగ్‌పై భారత ప్రభుత్వం ఆరా తీసింది. అక్కడి అధికారులను సంప్రదించి వివరాలను సేకరిస్తోంది. కాగా భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఇప్పటికే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారుల మిస్సింగ్‌ కలకలం రేపుతోంది.
ఈ మధ్యనే ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమీషన్ లో పనిచేస్తున్న ఇద్దరు పాకిస్థాన్ ఉద్యోగులను నిఘా కార్యకలాపాలు చేబడుతున్నారని భారత్ బహిష్కరించింది. అప్పటి నుండి ఇస్లామాబాద్ లోని భారత దౌత్య సిబ్బందిలో ఆందోళన నెలకొంది. వారికి రక్షణ కల్పించామని భారత్ పాకిస్థాన్ ను కోరింది.