ఆన్‌లైన్లో బుక్‌ చేసుకున్నాకే తిరుమలకు 

ఆన్‌లైన్‌ ద్వారా ప్రత్యేక దర్శనం టికెట్టు బుక్‌ చేసుకున్నాకే తిరుమలకు రావాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఇఒ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సూచించారు. ఆన్‌లైన్‌ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మూడు వేలు, తిరుపతిలోని కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు మూడు వేలు జారీ చేస్తున్నట్టు  తెలిపారు. 
 
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జూన్‌ 30వ తేదీ వరకు భక్తులు బుక్‌ చేసుకున్నారని, సర్వదర్శనం టోకెన్ల జారీ కోటా జూన్‌ 21వ తేదీ వరకు పూర్తయిందని తెలిపారు. ఆదివారం (14వ తేదీ) నుంచి జూన్‌ 22వ తేదీకి టోకెన్లు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. 
 
తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల ద్వారా దర్శనానికి రావాలనుకుంటే రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని చెప్పారు. సర్వదర్శం టోకెన్లు పొందిన భక్తులను వారికి కేటాయించిన తేదీల్లో మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. 
 
ఇలా  ఉండగా,ఈ నెల 21న సూర్యగ్రహణం దృష్ట్యా 20వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట నుంచి శ్రీవారి ఆలయం తలుపులు మూసివేసి 21న మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి తెరుస్తారని తెలిపారు.