దారుణంగా పడిపోయిన మామిడి పండ్ల ధరలు

దారుణంగా పడిపోయిన మామిడి పండ్ల ధరలు

ఆంధ్రప్రదేశ్‌లో మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సీజన్ ప్రారంభంలో ఆశలు రేపిన ధరలు, ఇప్పుడు కనివినీ ఎరుగని రీతిలో పతనం కావడంతో తోటల వద్దే కాయలు కుళ్లిపోయే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మామిడి ధరలు రికార్డు స్థాయిలో పలికాయి. అప్పట్లో టన్ను తోతాపురి మామిడి ధర రూ.1.10 లక్షలు ఉండగా, ప్రస్తుతం అది కేవలం రూ.4,000 నుంచి రూ.7,000 మధ్యకు పడిపోవడం గమనార్హం. 

అలాగే, ఎంతో డిమాండ్ ఉండే కవర్లు తొడిగిన బంగినపల్లి ధర రూ.1.75 లక్షల నుంచి ఏకంగా రూ.50,000 కు పతనమైంది. అంటే కేవలం మూడు నెలల కాలంలోనే ధరలు దాదాపు 90 శాతం పైగా క్షీణించాయి. పెట్టిన పెట్టుబడిలో కనీసం రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.  మామిడి ధరలు ఇంత దారుణంగా పడిపోవడానికి అంతర్జాతీయ పరిణామాలు ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి మార్గమైన హార్ముజ్ జలసంధి మూసివేతతో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి.  దీనికి తోడు దేశీయంగా ఎదురవుతున్న డీజిల్ కొరత కారణంగా లారీ రవాణా చార్జీలు పెరగడం, మరోవైపు వేసవి తీవ్రత వల్ల హోటళ్లు, జ్యూస్ సెంటర్లు ఆశించిన స్థాయిలో నడవకపోవడం ధరలపై ప్రభావం చూపాయి. స్థానిక మార్కెట్లలో వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను మరింత తగ్గించేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

ఎరువులు, పురుగు మందులు, కూలీల కోసం ఎకరాకు లక్షల్లో ఖర్చు చేసిన రైతులకు ఇప్పుడు కన్నీళ్లే మిగిలాయి. మార్కెట్‌కు కాయలు తీసుకెళ్తే కనీసం లారీ అద్దె కూడా రావడం లేదని, చాలా చోట్ల తోటల్లోనే మామిడి కాయలను వదిలేస్తున్నారని సమాచారం. ప్రభుత్వం వెంటనే స్పందించి మద్దతు ధర ప్రకటించాలని, పల్పింగ్ ఫ్యాక్టరీల ద్వారా కొనుగోళ్లు జరిపించి ఆదుకోవాలని మామిడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే వచ్చే ఏడాదికి తోటలను కాపాడుకోవడం కూడా భారమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.