రాజస్థాన్‌లో 2023లో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినప్పుడు విద్యార్థి సంఘం ఎన్నికలపై విధించిన నిషేధం, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తొలగించలేదు. ఎన్నికలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతుండటంతో, ఈ వ్యవహారం భజన్ లాల్ శర్మ ప్రభుత్వాన్ని ఒక విచిత్రమైన పరిస్థితిలో పడేసింది.
విద్యార్థులు తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకునే అవకాశం ఉండాలని వాదిస్తూ, ప్రభుత్వ నిధులతో నడిచే వివిధ విశ్వవిద్యాలయాలలో విద్యార్థి సంఘం ఎన్నికలను అనుమతించాలని కాంగ్రెస్ కూడా డిమాండ్ చేసింది. ఎన్నికలు జరగాలని డిమాండ్ చేసిన వారిలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (జోధ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు), మాజీ బీజేపీ మంత్రులు రాజేంద్ర సింగ్ రాథోడ్, రాజ్‌పాల్ సింగ్ షెకావత్, అలాగే తమ కళాశాల, విశ్వవిద్యాలయ రోజుల్లో విద్యార్థి నాయకులుగా ఉన్న పలువురు ఎంపీలు, ప్రస్తుత, మాజీ శాసనసభ్యులు ఉన్నారు.
అయితే, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే రాజస్థాన్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం ఎన్నికల పునరుద్ధరణ కోసం కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఎన్‌ఎస్‌యూఐ తొలుత గళం విప్పింది. విద్యార్థి ఎన్నికలపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు శుభమ్ రేవర్ విశ్వవిద్యాలయంలో 15 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ప్రతిపక్ష నాయకుడు టికా రామ్ జుల్లీ సూచన మేరకు, ఆరోగ్యం క్షీణించడంతో ఆయన తన దీక్షను విరమించారు.
ఆ తర్వాత ఎబివిపి రాష్ట్ర వ్యాప్త నిరసనలను ప్రారంభించింది. విద్యార్థి సంఘం ఎన్నికలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రాజస్థాన్ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. కొందరు గేటుపైకి ఎక్కారు. శాంతిభద్రతలకు భంగం కలిగించడం, అనధికారికంగా ప్రవేశించడం వంటి ఆరోపణలతో పోలీసులు 35 మంది విద్యార్థులను అరెస్టు చేశారు.
జోధ్‌పూర్‌లో, గత నాలుగేళ్లుగా ఎన్నికలు జరగని జై నారాయణ్ వ్యాస్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలని మోతీ సింగ్ జోధా నేతృత్వంలోని ఏబీవీపీ నిరసనకారులు డిమాండ్ చేశారు. ఉదయ్‌పూర్‌లోని మోహన్‌లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయంలో, ఎన్‌ఎస్‌యూఐ, ఎబివిపికి చెందిన విద్యార్థుల మధ్య ఘర్షణ జరగడంతో, గుంపును చెదరగొట్టడానికి విశ్వవిద్యాలయ పరిపాలన పోలీసులను పిలిపించింది. రాష్ట్రవ్యాప్తం గా వివిధ జిల్లా కేంద్రాలలో ఇలాంటి నిరసనలు కనిపించాయి, ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ రెండూ విద్యార్థి ఎన్నికలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశాయి.

More Stories
మణిపూర్‌లో 24 వేల మంది నిర్వాసితుల పునరావాసంపై సుప్రీం ఆదేశం
జేపీఎస్సీ పరీక్షలో అక్రమాలపై దర్యాప్తుకు దిగిన ఈడీ
అరుణాచల్‌లోని 27 ప్రదేశాలను చైనా పేర్లను తిప్పికొట్టిన భారత్