దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఢిల్లీ కోర్టు శనివారం 14 మంది నిందితులపై అధికారికంగా అభియోగాలను నమోదు చేసింది. నిందితులందరూ తాము నిర్దోషులమని పేర్కొన్న నేపథ్యంలో, ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ గుప్తా వారిపై అభియోగాలను నమోదు చేశారు. మోసం, నేరపూరిత విశ్వాసఘాతుకం, అవినీతి, పరీక్షలకు సంబంధించిన అక్రమాలకు పాల్పడినట్టు నిందితులపై అభియోగాల నమోదు ప్రక్రియ పూర్తి కావడంతో, ఈ కేసులో ఇకపై తుది విచారణ ప్రారంభం కానుంది.
నవంబర్ 25న విచారణ ప్రారంభం కానుంది. ఆ రోజు నుండి కోర్టు రోజువారీగా ప్రాసిక్యూషన్ సాక్ష్యాలను నమోదు చేయడం ప్రారంభిస్తుంది. ఆరోపిత పరీక్షల కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), దాదాపు 20,000 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ గుప్తా ఆగస్టు 12న ఏజెన్సీ యొక్క ప్రాథమిక ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. ఆ తర్వాత 14వ నిందితుడిపై అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
నిందితుల్లో ప్రహ్లాద్ కులకర్ణి, మనీసా మాంధారే, మనీసా సంజయ్ హవల్దార్ అనే ముగ్గురు నిందితులు ఎన్టిఎతో సంబంధం ఉన్నవారు. తమకు అప్పగించిన రహస్య పత్రాలను దుర్వినియోగం చేసి ఇతర నిందితులకు అప్పగించారని సిబిఐ ఆరోపిస్తోంది. ఈ ముగ్గురిపై కుట్ర, మోసం,నమ్మకద్రోహం, సాక్షాల ధ్వంసం, వంటి నేరాలు, అవినీతి, ప్రభుత్వసేవకుల దుర్వినియోగం,పబ్లిక్ పరీక్షల్లో అక్రమ పద్ధతులు,కాపీరైట్ ఉల్లంఘనకు సంబంధించిన నేరాలు నమోదయ్యాయి. మిగిలిన 11 మందిపై వారి పాత్రను బట్టి సంబంధిత నేరాల కింద అభియోగాలు నమోదయ్యాయి.
సీబీఐ ప్రకారం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి అనుబంధంగా ఉన్న ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులు వివిధ పద్ధతులను ఉపయోగించి రహస్య పరీక్ష ప్రశ్నపత్రాలను వారి కార్యాలయం నుండి బయటకు తీసుకువెళ్లారని ఆరోపణలు ఉన్నాయి. వారిలో ఒకరు ప్రశ్నలను కాగితపు చీటీలపై కాపీ చేయగా, మిగిలిన వారు వాటిని కంఠస్థం చేసి, ఆ తర్వాత అదే విషయాన్ని తిరిగి రాశారని ఆరోపణలు ఉన్నాయి. నిపుణులు రహస్య విభాగం నుండి బయటకు వచ్చినప్పుడు తనిఖీ చేయకపోవడం వంటి భద్రతా లోపాలే దీనికి కారణమని ఏజెన్సీ ఆరోపించింది.

More Stories
స్వదేశీ బర్డ్ ఫ్లూ టీకా వచ్చేసింది
మేనరికం వివాహాల నిషేధంకై చట్టం.. `సుప్రీం’ సూచన!
మణిపూర్‌లో కల్తీ మద్యం కలకలం.. 15 మంది మృతి!