మణిపూర్‌లో కల్తీ మద్యం కలకలం.. 11 మంది మృతి!

మణిపూర్‌లో కలుషిత మద్యం తాగిన‌ట్లు అనుమానిస్తున్న ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 181 మందికిపైగా అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరారు. చాండెల్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన మ‌ణిపూర్‌ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.  

చాండెల్‌ జిల్లాలోని చక్పికారోంగ్‌ సబ్‌ డివిజన్‌, పరిసర వెస్ట్రన్‌ వ్యాలీ ప్రాంతాల్లో మూడు రోజులుగా మరణాలు నమోదవుతున్నాయి. ఖంబతేల్‌, జుల్బాంగ్‌చింగ్‌, కనంకు, నంగ్‌పాన్‌, డాంగ్‌ఖు తదితర గ్రామాలకు చెందిన యువకులు, మధ్య వయస్కులైన పురుషులు ఈ ఘటనలో బాధితులుగా ఉన్నారు.  

ఈ ఘటనపై స్పందించిన మణిపూర్‌ ముఖ్యమంత్రి యుమ్నామ్‌ ఖేమ్‌చంద్‌ సింగ్‌ శుక్రవారం ఇంఫాల్‌లోని షిజా ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర వైద్య ఏర్పాట్లను సమీక్షించారు. పలువురు బాధితులు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.

ప్రాథమిక దర్యాప్తులో కల్తీ మద్యం పొరుగున ఉన్న కాక్చింగ్‌ జిల్లాలోని సుగ్ను ప్రాంతం నుంచి సరఫరా అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. చాండెల్‌ జిల్లాలో స్థానికంగా దేశీయ మద్యం తయారీ జరుగుతున్నట్లు సమాచారం లేదని ఎస్పీ ధర్మేంద్ర కుమార్‌ జిల్లా కలెక్టర్‌కు పంపిన నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఇతర జిల్లాల నుంచి మద్యం సరఫరా అవుతున్న మార్గాలపై పోలీసులు దృష్టి సారించారు. 

అయితే మద్యం కల్తీకి అసలు కారణం, అందులో కలిసిన పదార్థాలు ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అత్యవసర ఆరోగ్య హెచ్చరికలు జారీ చేశాయి. స్థానికంగా తయారైన మద్యం, నాణ్యతపై అనుమానాలున్న పానీయాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించాయి. అనుమానిత మద్యం తాగినవారు ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా వెంటనే వైద్య సహాయం పొందాలని కోరాయి.

అలాగే అనుమానిత మద్యం నిల్వలను ఎవరూ సేవించవద్దని, విక్రయించవద్దని, ఇతరులకు పంచవద్దని, అధికారుల పరిశీలనకు ముందే పారవేయవద్దని పోలీసులు, గ్రామ పెద్దలు విజ్ఞప్తి చేశారు. అక్రమ మద్యం తయారీ లేదా సరఫరా గురించి సమాచారం తెలిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు.

 

 

About The Author