వాహనాల కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం (పీయూసీ) గడువులో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేసింది. వాహనం వయస్సు, దాని ఉద్గార ప్రమాణాలను బట్టి పీయూసీ సర్టిఫికెట్ చెల్లుబాటు వ్యవధిని నిర్ణయించింది. కొత్త వాహనాల యజమానులపై తరచూ కాలుష్య పరీక్షలు చేయించుకోవాల్సిన భారాన్ని తగ్గించడంతో పాటు, పాత వాహనాల నుంచి వెలువడే కాలుష్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఈ మార్పులు తీసుకొచ్చింది.
మోటారు వాహనాల నిబంధనల్లోని 115వ రూల్ సబ్ రూల్ (7)కు సవరణలు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం బీఎస్-1, బీఎస్-2, బీఎస్-3 వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్ గడువు మూడు నెలలుగా నిర్ణయించారు. బీఎస్-4 వాహనాలకు ఆరు నెలల పాటు చెల్లుబాటు అవుతుంది. బీఎస్-6 ప్రమాణాలు కలిగిన నాన్-ట్రాన్స్పోర్ట్ వాహనాలకు వాటి వయస్సును బట్టి గడువు ఉంటుంది.
మొదటి రిజిస్ట్రేషన్ నుంచి ఆరేళ్లలోపు ఉన్న వాహనాలకు మూడేళ్లు, ఆరేళ్లు దాటి పదేళ్లలోపు ఉన్న వాహనాలకు ఏడాది, పదేళ్లు దాటిన వాహనాలకు ఆరు నెలల పాటు పీయూసీ సర్టిఫికెట్ చెల్లుబాటవుతుంది. బీఎస్-6 ట్రాన్స్పోర్ట్ వాహనాలకు మొదటి రిజిస్ట్రేషన్ నుంచి ఆరేళ్లలోపు ఉంటే రెండేళ్లు, ఆరేళ్లు దాటి పదేళ్లలోపు ఉంటే ఏడాది, పదేళ్లు దాటితే ఆరు నెలల పాటు పీయూసీ గడువు ఉంటుంది.
కొత్త సవరణలు అమల్లోకి రాకముందే జారీ చేసిన పీయూసీ సర్టిఫికెట్లకు వెంటనే కొత్త గడువు వర్తించదు. సవరణలు అమల్లోకి వచ్చిన తర్వాత ఆయా సర్టిఫికెట్లను తొలిసారి రెన్యువల్ చేసుకున్నప్పటి నుంచి కొత్త గడువు వర్తిస్తుంది. ఈ మేరకు పాత సర్టిఫికెట్లకు ప్రత్యేక మార్పిడి విధానాన్ని కల్పించారు.
ప్రస్తుత పీయూసీ సర్టిఫికెట్ గడువు ముగియడానికి పది రోజుల ముందు రెన్యువల్ చేసుకుంటే, కొత్త సర్టిఫికెట్ గడువు పాత సర్టిఫికెట్ ముగిసిన తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దీంతో ముందుగానే రెన్యువల్ చేసుకున్నప్పటికీ మిగిలిన గడువు నష్టపోరు. అయితే పాత సర్టిఫికెట్ గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ చేసుకుంటే, కొత్త సర్టిఫికెట్ చెల్లుబాటు రెన్యువల్ చేసిన తేదీ నుంచే ప్రారంభమవుతుంది.

More Stories
మధుమేహం ఉన్నవారికి 21 రకాల క్యాన్సర్ల ప్రమాదం
సీజేఐపై వ్యాఖ్యలు చేసిన న్యాయవాదికి `సుప్రీం’ ధిక్కార నోటీసులు
యుపి ఎస్ఎస్ఆర్ ముసాయిదా ఓటర్ల జాబితాలో19 లక్షల కొత్త ఓటర్లు