స్వదేశీ బర్డ్‌ ఫ్లూ టీకా వచ్చేసింది

కోళ్లను బర్డ్‌ ఫ్లూ నుంచి రక్షించేందుకు దేశంలో తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన హెచ్‌5ఎన్‌1 వ్యాక్సిన్‌ను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌  భోపాల్‌లో ఆవిష్కరించారు. భోపాల్‌లోని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌)-జాతీయ హై సెక్యూరిటీ జంతు వ్యాధుల సంస్థ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. 

అత్యంత వ్యాధికారక పక్షి ఇన్‌ఫ్లూయెంజా (హెచ్‌పీఏఐ)లోని క్లేడ్‌ 2.3.2.1ఏకు చెందిన హెచ్‌5ఎన్‌1 వైరస్‌పై భారత్‌లో రూపొందించిన తొలి వ్యాక్సిన్‌ ఇదేనని వారు పేర్కొన్నారు. సాధారణంగా బర్డ్‌ ఫ్లూ అని పిలిచే హెచ్‌పీఏఐ కోళ్లు, ఇతర పక్షులకు సోకే తీవ్ర వ్యాధి. వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు సోకిన పక్షుల్లో దాదాపు 100 శాతం మరణాలు సంభవించే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.  

కోత్తగా అభివృద్ధి చేసిన ఈ టీకా కేవలం ఒకే డోసుతో సుమారు ఆరు నెలల పాటు రక్షణను అందిస్తుందని అంచనా. ఇది ముఖ్యంగా గుడ్లు పెట్టే కోళ్లకు మరియు బ్రీడర్ కోళ్లకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే  హెచ్‌5ఎన్‌1కి వ్యతిరేకంగా లభించే ఈ అదనపు రక్షణ వల్ల అవి ప్రయోజనం పొందుతాయని భావిస్తున్నారు.

భోపాల్‌లోని ఆనంద్‌నగర్‌లో ఉన్న ఐసీఏఆర్‌-జాతీయ హై సెక్యూరిటీ జంతు వ్యాధుల సంస్థలో నిర్వహించిన కార్యక్రమంలో చౌహాన్‌ మాట్లాడుతూ బర్డ్‌ ఫ్లూ నివారణ, జంతు ఆరోగ్య పరిరక్షణ రంగంలో ఈ స్వదేశీ వ్యాక్సిన్‌ దేశానికి ముఖ్యమైన విజయమని చెప్పారు. 2006 నుంచి దేశంలో హెచ్‌5ఎన్‌1, హెచ్‌5ఎన్‌8 వైరస్‌లకు సంబంధించి 500కుపైగా వ్యాప్తి ఘటనలు నమోదయ్యాయని, ఇప్పటివరకు హెచ్‌5ఎన్‌1 వైరస్‌కు ప్రత్యేక వ్యాక్సిన్‌ అందుబాటులో లేదని తెలిపారు. 

ఈ సవాలును ఎదుర్కొనేందుకు భోపాల్‌ సంస్థ స్వదేశీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిందని, ఒక్కో డోసు ధర రూ.1 నుంచి రూ.2 మధ్య ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా భోపాల్‌లో రూ.300 కోట్లతో అత్యాధునిక ప్రయోగశాల ఏర్పాటు చేయనున్నట్లు చౌహాన్‌ ప్రకటించారు. బర్డ్ ఫ్లూ అనేది కేవలం కోళ్ళకు మాత్రమే ముప్పుగా పరిగణించగిన వ్యాధి కాదు. నిషాద్ శాస్త్రవేత్తల ప్రకారం,  హెచ్‌5ఎన్‌1  వైరస్ పక్షుల నుండి మానవులకు వ్యాపించే అవకాశం ఉన్నందున, ప్రజారోగ్య దృక్కోణం నుండి కూడా కోళ్ళలో సంక్రమణను నియంత్రించడం చాలా ముఖ్యం.

కోళ్ళకు సకాలంలో టీకాలు వేయడం వల్ల సంక్రమణ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గించవచ్చు, తద్వారా వైరస్ మానవులకు చేరే అవకాశాన్ని పరిమితం చేయవచ్చు. అందువల్ల, స్వదేశీ టీకాను అభివృద్ధి చేయడం అనేది కేవలం రైతులకు, కోళ్ళ పరిశ్రమకు మాత్రమే కాకుండా, మానవ ఆరోగ్యాన్ని పరిరక్షించే ప్రయత్నాలకు కూడా చాలా ముఖ్యమైనది.

 

About The Author