అగ్నివీరులకు వివాహం చేసుకోవటానికి అనుమతి

 
దేశ రక్షణ దళాల్లో సేవలందిస్తున్న అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పొడిగించిన అదనపు రెండేళ్ల సర్వీసు కాలంలో అగ్నివీరులు వివాహం చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా, ఈ పొడిగించిన సర్వీసు సమయంలో మహిళా అగ్నివీరులు గర్భం దాల్చినట్లయితే, వారికి నిబంధనల ప్రకారం మెటర్నిటీ బెనిఫిట్స్ (ప్రసూతి ప్రయోజనాలు) మరియు వేతనంతో కూడిన సెలవులను కూడా మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేసింది. 
 
అయితే, నియామకం జరిగిన మొదటి నాలుగేళ్ల సర్వీసు కాలంలో మాత్రం అగ్నివీరులు వివాహం చేసుకోవడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని, ఆ నిబంధన యథాతథంగా కొనసాగుతుందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. రెండోదశ సర్వీసులో చేరి సుమారు 4 వారాలపాటు సాగే ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న వారికే వివాహం చేసుకోవటానికి అనుమతి లభిస్తుంది.
 
ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే మహిళా అగ్నివీరులకు కూడా కుటుంబ జీవితానికి సంబంధించిన వెసులుబాటు లభించనుంది. ముఖ్యంగా ప్రసూతి సెలవులు, పిల్లల సంరక్షణ, దత్తత సెలవులపై స్పష్టత రావాల్సి ఉంది. 2023 నవంబర్‌లో మహిళా సైనిక సిబ్బందికి 180 రోజుల ప్రసూతి సెలవులను రక్షణ శాఖ ఆమోదించింది. అయితే పొడిగింపు సర్వీసులో ఉన్న మహిళా అగ్నివీరులకు ఈ ప్రయోజనాలు ఎలా వర్తిస్తాయన్నది ఇంకా ఖరారు కాలేదు.
 
అగ్నిపథ్ పథకం కింద ఎంపికైన అగ్నివీరుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా కేంద్రం ఇటీవల కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనల ప్రకారం, తొలి నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత ప్రతిభ ఆధారంగా 25 శాతం మంది అగ్నివీరులను శాశ్వత (రెగ్యులర్) సర్వీసులోకి తీసుకుంటుండగా, మిగిలిన 75 శాతం మందికి మరో రెండేళ్ల పాటు అదనంగా పనిచేసే అవకాశాన్ని కల్పించింది.
 
ప్రస్తుతం అగ్నివీరులకు ఏడాదికి 30 రోజుల సెలవులు మాత్రమే ఉన్నాయి. రెగ్యులర్‌ సైనికులకు 90 రోజుల వరకు సెలవులు లభిస్తున్నాయి. పొడిగింపు సర్వీసులో ఉన్న అగ్నివీరుల సెలవుల నిబంధనల్లోనూ మార్పులు తీసుకురావాలని సైన్యం పరిశీలిస్తోంది. మరోవైపు త్రివిధ దళాల్లో బలగాల కొరతను భర్తీ చేసేందుకు రానున్న రోజుల్లో అగ్నివీరుల నియామకాలను పెంచే యోచనలో భారత సైన్యం ఉన్నట్లు సమాచారం. అయితే, విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

About The Author