జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ) 14వ ప్రిలిమినరీ పరీక్షలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. సిఐడిలో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ గత వారం ఈసీఐఆర్ దాఖలు చేసింది. అంతకుముందు ఆదివారం, నిరసన చేస్తున్న జేపీఎస్సీ– జెఎస్ఎస్ సి విద్యార్థులతో సుదీర్ఘ సమావేశం అనంతరం, నియామకాలలో జరిగిన అవకతవకలపై సిఐడి, ఈడీ దర్యాప్తునకు హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ సమావేశం అనంతరం మంత్రి సుదివ్య కుమార్ సోను మాట్లాడుతూ, విద్యార్థులు లేవనెత్తిన అంశాలలో 98 శాతాన్ని ప్రభుత్వం అంగీకరించిందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. 14వ జేపీఎస్సీ పరీక్షను, అలాగే 2023, 2025 బ్యాక్లాగ్ నియామక పరీక్షలను రద్దు చేయడంతో సహా విద్యార్థులు లేవనెత్తిన అనేక డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిందని ఆయన చెప్పారు. అయితే, జెఎస్ఎస్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సిజిఎల్) పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్‌కు గానీ, ప్రభుత్వ నియామక పరీక్షలలో జరిగిన అవకతవకలపై సిబిఐ దర్యాప్తు జరపాలన్న డిమాండ్‌కు గానీ ప్రభుత్వం అంగీకరించలేదు.
“మిగిలిన రెండు శాతం, ముఖ్యంగా సీజీఎల్ పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్‌ను నెరవేర్చలేకపోయాము. ఎందుకంటే హైకోర్టు, సుప్రీంకోర్టుల ఆదేశాల మేరకు నిర్వహించే పరీక్షను ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయలేదు,” అని ఆయన పేర్కొన్నారు. నిరసన చేస్తున్న విద్యార్థులు ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించి, సోమవారం ‘విధానసభ ఘెరావ్’ (అసెంబ్లీ మార్చ్)కు పిలుపునిచ్చారు.
విద్యార్థుల ప్రకారం, సీబీఐ విచారణ జరపాలన్న ప్రాథమిక డిమాండ్‌ను అంగీకరించలేదు. తమ డిమాండ్లలో 98 శాతం నెరవేర్చామని జార్ఖండ్ ప్రభుత్వం ‘అబద్ధాలు’ ప్రచారం చేస్తోందని నిరసన చేస్తున్న విద్యార్థులు ఆరోపించారు. నిరసనకారులు రద్దు చేయాలని డిమాండ్ చేసిన 13 పరీక్షలలో ప్రభుత్వం కేవలం మూడింటిని మాత్రమే రద్దు చేసిందని ఒక విద్యార్థి నాయకుడు పేర్కొన్నారు.
సీఐడీ విచారణపై ఆధారపడాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా విద్యార్థి నాయకులు విమర్శించారు. గతంలో ఆ ఏజెన్సీకి ‘కప్పిపుచ్చడాల’తో సంబంధం ఉందని వారు ఆరోపించారు. ఆరోపించిన అవకతవకలను వెలికితీయడానికి, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి స్వతంత్ర విచారణ అవసరమని నిరసనకారులు స్పష్టం చేశారు. కాగా, నిరసనలు 17వ రోజుకు చేరుకోవడం, విద్యార్థుల నిరసనలకు దేశవ్యాప్తంగా మద్దతు రావడంతో పాటు ఆరుగురు అభ్యర్థులు నిరాహార దీక్షకు దిగడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.
మరోవంక, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో జేపీఎస్సీకి చెందిన ముగ్గురు సభ్యులు డాక్టర్ అజిత భట్టాచార్య, డాక్టర్ అనిమా హన్స్దా, డాక్టర్ జమాల్ అహ్మద్ తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను గవర్నర్‌కు అందజేశారు.

More Stories
అరుణాచల్‌లోని 27 ప్రదేశాలను చైనా పేర్లను తిప్పికొట్టిన భారత్
మహారాష్ట్ర ప్రభుత్వం 144 `ఉగ్రవాద’ ప్రచురణాలపై నిషేధం!
అగ్ని-4 బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష విజయవంతం