మూసీ ప్రక్షాళనపై క్యాబినెట్‌ లో మంత్రుల వాడీవేడి చర్చలు

మూసీ ప్రక్షాళనపై క్యాబినెట్‌ లో మంత్రుల వాడీవేడి చర్చలు
మూసీ ప్రక్షాళనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, క్యాబినెట్‌ మంత్రుల మధ్య గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వాడీవేడి చర్చలు జరిగినట్టు తెలుస్తున్నది. మూసీ తొలి దశ పనులను యుద్ధప్రాతిపతికన పూర్తిచేసిన తర్వాతే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వెళ్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన నేపథ్యంలో మంత్రులు ఘాటుగా స్పందించింనట్టు తెలిసింది. 
 
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు మూసీ ఎజెండా పెట్టడమూ సరైన నిర్ణయం కాదని సీనియర్‌ మంత్రి ఒకరు అభ్యంతరం వ్యక్తంచేసినట్టు చెబుతున్నారు. గురువారం మూసీ మొదటి ఫేజ్‌ పనులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అంశంపై క్యాబినెట్‌లో చర్చ జరిగింది. రూ. 7,345 కోట్లతో 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈసా నుంచి మూసీ ప్రవాహం ప్రారంభమయ్యే స్థలం నుంచి బాపూఘాట్‌ వరకు తొలిదశ పనులు చేపట్టడానికి మంత్రివర్గం ఆమోదించింది. 
 
పనులు చేయడం మాత్రమే కాదని, మూసీలోకి నీళ్లు వదిలినప్పుడే దాని ఫలితం కనిపిస్తుందని, ఇప్పటికిప్పుడు నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి మూసీలోకి వదులుతారని  మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు.   ఎత్తిపోసే 20 టీఎంసీలలో 17.5 టీఎంసీలు తాగునీటికి పోతే, మిగిలిన రెండున్నర టీఎంసీలు మొత్తం వస్తుందా? అని అడిగినట్లు సమాచారం. మూసీపై చేసే ఖర్చు, ఆదాయం రేషియో ఏమిటని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఈ సమయంలో జోక్యం చేసుకున్న ఓ సీనియర్‌ మంత్రి ప్రతిపక్ష నేతల మాదిరే మనం మాట్లాడితే ఎలాగని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. విపక్షానికి చెందిన ఓ నాయకుడు మాత్రం మూసీని పునరుద్ధరణ జరగనివ్వబోమని చాలా గట్టిగా మాట్లాడుతున్నారని, అలాంటి వారికి బలంగా సమాధానం చెప్పాల్సింది పోయి, మనం కూడా వారి భాషే మాట్లాడితే ఎలా? అంటూ ఉత్తమ్‌ లేవనెత్తిన అంశాలకు సీఎం వివరణ ఇచ్చినట్లు తెలిసింది.  గోదావరి జలాలతో నింపడమంటే అసెంబ్లీ ఎన్నికల నాటికి మన గోతి మనమే తవ్వుకొన్నట్టు అవుతుందని అన్నట్లు తెలిసింది. 
 
పనికిరాని ప్రాజెక్టు అని చెప్పకొంటూ ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు ఎలా తీసుకొద్దామని మంత్రి అడిగినట్లు తెలిసింది. సాగునీటి ప్రాజెక్టుల సవరించిన అంచనాల ఫైళ్లు కేబినెట్‌ ముందుకు ఎందుకు రావడం లేదని ఉత్తమ్‌ ప్రశ్నించగా, వచ్చే కేబినెట్‌ భేటీలో ముఖ్య ఎజెండాగా చర్చిద్దామని సీఎం అన్నట్లు సమాచారం. ఈ నెల 17న జరిగే మంత్రివర్గ సమావేశంలో సవరించిన అంచనాలపైనే మొదట చర్చ ఉంటుందని తెలిపారు. ఆ రోజు వరకు అన్ని ఫైళ్లు సిద్ధం చేయాలని, ఆ ఎజెండా ముగిశాకే వేరే అంశానికి వెళ్దామని స్పష్టం చేశారు.