ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏకైక ఆశాకిరణమని, యావత్ ప్రపంచం వారి వైపే ఆశగా చూస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత, ఉపాధ్యాయులు, ఆధ్యాత్మిక గురువుల భారీ భాగస్వామ్యంతో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘గ్లో పీస్’ అంతర్జాతీయ శాంతి సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అనేక దేశాలు నిరంతరాయంగా యుద్ధాల్లో మునిగిపోవడం వల్ల ఎంతో మంది అమాయక ప్రజలు, పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని, తీవ్రమైన మానవ, ఆర్థిక, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన హిరోషిమా, నాగసాకి అణు విపత్తులను గుర్తుచేస్తూ ప్రస్తుత కాలంలో అణ్వాయుధ ముప్పు అనేది యావత్ భూగోళానికి, మానవాళి మనుగడకే ప్రమాదకరంగా మారిందని హెచ్చరించారు.
యుద్ధాలు ఎప్పటికీ సమస్యలకు పరిష్కారం కాలేవని, కేవలం శాంతి ద్వారానే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. కొన్ని దేశాలను పాలిస్తున్న నేతల్లో ఈ శాంతి ఆలోచన లోపించడం దురదృష్టకరమని చెప్పారు. ఈ ‘గ్లో పీస్’ సదస్సు యువ మనసుల్లో శాంతి భావనలను నాటడానికి ఒక అద్భుతమైన వేదిక అని రాంచందర్ రావు కొనియాడారు.
శాంతి అనేది కేవలం దేశాల మధ్యే కాదని, ఇల్లు, బడి, స్నేహితులు, సమాజం నుండి ప్రారంభం కావాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు చిన్నతనం నుంచే శాంతియుతంగా ఉంటూ, ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వాలని కోరారు. ప్రపంచ శాంతి కోసం ఈ సదస్సు ద్వారా ఒక భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని ఆయన వెల్లడించారు. ఒక్క డిపిఎస్ నాచారం నుంచే దాదాపు 20 వేల మంది విద్యార్థులు పాల్గొనగా ఇతర పాఠశాలలను కూడా కలుపుకుని మొత్తం ఒక లక్ష పోస్ట్‌కార్డులను ప్రధానమంత్రికి పంపుతున్నట్లు తెలిపారు.
ప్రపంచంలో శాంతి కోసం ప్రయత్నాలు చేసి, ఒక ‘శాంతి దూత’గా నిలవాలని కోరుతూ విద్యార్థులు ఈ కార్డులను రాశారని చెప్పారు. పాఠశాల స్థాయిలో ప్రారంభమైన ఈ చిన్న కార్యక్రమం ప్రపంచానికి ఒక పెద్ద సందేశాన్ని ఇస్తుందని, భవిష్యత్తులో ఇది దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయంగా ఒక గొప్ప శాంతి ఉద్యమంగా మారుతుందని రాంచందర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.

More Stories
మూసీ ప్రక్షాళనపై క్యాబినెట్ లో మంత్రుల వాడీవేడి చర్చలు
హైదరాబాద్ డీఎస్పీ రూ. 200 కోట్ల సామ్రాజ్యాన్ని బయటపెట్టిన ఏసీబీ
నితిన్ నబిన్ పర్యటనతో రేవంత్ రెడ్డిలో భయాందోళనలు