మహబూబ్‌నగర్‌లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్

మహబూబ్‌నగర్‌లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
రక్షణ రంగానికి సంబంధించి మహబూబ్‌నగర్ జిల్లాలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. దేవరకద్ర మండలంలోని జీనుగురాల, చౌదర్‌పల్లి, బస్వాయిపల్లి గ్రామాల పరిధిలో ప్రతిష్టాత్మక ‘బ్రహ్మోస్ మిస్సైల్’ తయారీ యూనిట్  ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ అత్యంత వేగవంతమైంది. ఈ కేంద్రం కోసం అధికారులు మొత్తం 416.18 ఎకరాల భూమిని ప్రాథమికంగా గుర్తించి, ఇప్పటికే సంబంధిత సర్వేలను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. 
 
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్య జరిగిన ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఈ కీలక ప్రాజెక్టు పట్టాలెక్కడంతో తెలంగాణలో డిఫెన్స్ కారిడార్ విస్తరణకు మరింత బలమైన పునాది పడినట్లయింది. ఈ బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ రాకతో పాలమూరు జిల్లా ఆర్థిక, పారిశ్రామిక రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. 
 
అత్యంత సున్నితమైన, ఆధునిక సాంకేతికతతో పనిచేసే ఈ డిఫెన్స్ ప్రాజెక్ట్ వల్ల స్థానికంగా ఉండే ఇంజనీరింగ్, డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసిన యువతకు భారీగా లబ్ధి చేకూరనుంది. వేల సంఖ్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రవాణా, కేటరింగ్, రియల్ ఎస్టేట్, ఇతర సహాయక రంగాలు విపరీతంగా అభివృద్ధి చెందుతాయి. 
 
గడిచిన కొన్నేళ్లుగా వలసల జిల్లాగా పేరుగాంచిన మహబూబ్‌నగర్, ఇప్పుడు రక్షణ రంగ ఉత్పత్తుల హబ్‌గా రూపాంతరం చెందడం ఈ ప్రాంత ప్రజలకు గొప్ప అవకాశంగా మారనుంది.