ఆయుష్ వైద్య విద్యార్థుల మహా ధర్నా.. ఎబివిపి మద్దతు

ఆయుష్  వైద్య విద్యార్థుల మహా ధర్నా.. ఎబివిపి మద్దతు
తెలంగాణలో ఆయుష్ హౌస్ సర్జన్లు, ఇంటర్న్లు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ వైద్యుల స్టైపెండ్ పెంపు కోసం తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్లు, పిజి జేఏసీ  ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా గురువారం ఇందిరాపార్క్‌లోని ధర్నాచౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆయుష్ వైద్య విద్యాసంస్థలకు చెందిన వెయ్యికి పైగా విద్యార్థులు, ఇంటర్న్లు, హౌస్ సర్జన్లు, పిజి వైద్యులు ఈ మహా ధర్నాలో పాల్గొని తమ నిరసనను బలంగా వ్యక్తం చేశారు. 

దాదాపు 10 సంవత్సరాలుగా స్టైపెండ్లు పెంచకపోవడం, ఆయుష్ వైద్య విద్యార్థుల పట్ల కొనసాగుతున్న అసమానత, వివక్షకు నిరసనగా ఈ ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని డా. బి.ఆర్.కె.ఆర్. ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల & ఆసుపత్రి, ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల/ఆసుపత్రి, జేఎస్ పీఎస్ ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల & ఆసుపత్రి, ప్రభుత్వ నిజామియా టిబ్బీ యునాని వైద్య కళాశాల & ఆసుపత్రి, ప్రభుత్వ నేచర్ క్యూర్ ఆసుపత్రిలకు చెందిన వారు భారీగా పాల్గొన్నారు.

ఈ మహా ధర్నాకు పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నాయకులు, ఆయుష్  సంఘాల ప్రతినిధులు, వైద్య రంగ ప్రముఖులు హాజరై ఆయుష్ వైద్యుల న్యాయమైన పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎబివిపి జాతీయ కార్యదర్శి శ్రవణ్ బిరాజ్,  హైదరాబాద్ సిటీ కార్యదర్శి జి. పృథ్విరాజ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి  శ్యామ్, మహేష్ తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.

రాజకీయ, ప్రజా ప్రతినిధులుగా ఎమ్యెల్సీ సత్యం, తీన్‌మార్ మల్లన్న, అంజిరెడ్డి, ఎమ్యెల్యే రాకేష్ రెడ్డి తదితరులు తమ మద్దతు ప్రకటించారు. ఇతర ప్రముఖుల్లో మాజీ తెలంగాణ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు, హైకోర్టు అడ్వకేట్ అనుపమ, జనసేన నాయకుడు డాక్టర్ మాధవ్ రెడ్డి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్ తదితరులు కూడా సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయుష్-జేఏసీఅధ్యక్షుడు డాక్టర్ బి. రాజేష్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రభుత్వం పది రోజులుగా తమ సమస్యను పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. “న్యాయం జరిగే వరకు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయం. మా పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించం. ఇది కేవలం స్టైపెండ్ కోసం చేస్తున్న పోరాటం కాదు. ఆయుష్ వైద్య విద్యార్థుల సమానత్వం, గౌరవం, భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం” అని స్పష్టం చేశారు.

జేఏసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ నితిన్, డాక్టర్ నవనీత్, డాక్టర్ శ్రవణ్, డాక్టర్ రాకేష్, డాక్టర్ దర్శిని, డాక్టర్ బలీగ్, డాక్టర్ మహ్మూద్, డాక్టర్ ముషీర్, డాక్టర్ ఇబ్రహీం, డాక్టర్ బషీర్ తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో పాల్గొన్న పలువురు నాయకులు మాట్లాడుతూ సమస్య పరిష్కారం కాకపోతే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఆయుష్ సంస్థలు కలిసి ఉద్యమానికి మరింత మద్దతు ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు. అవసరమైతే ఈ పోరాటాన్ని తెలంగాణను దాటి జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కూడా మద్దతు ఇస్తామని పలువురు నాయకులు పేర్కొన్నారు.

గతంలో ఎన్నోసార్లు వినతులు, సమావేశాలు, విజ్ఞప్తులు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, ఇకపై కేవలం హామీలతో ఉద్యమాన్ని విరమించేది లేదని తెలిపారు. ఆయుష్ స్టైపెండ్ పెంపునకు సంబంధించి తక్షణమే అధికారిక జిఓ విడుదల చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. “పది సంవత్సరాల నిరీక్షణకు ఇక ముగింపు పలకాలి. మాకు మరో హామీ అవసరం లేదు — న్యాయం చేసే జిఓ  కావాలి.” అని విద్యార్థులు స్పష్టం చేశారు.