తెలంగాణలో ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ)పై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ఆయనకు తెలిసిన ఆదాయ వనరులకు మించి, సుమారు రూ. 200 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు బహిర్గతం చేసింది. ఈ అధికారిపై కేసు నమోదు చేసిన ఏసీబీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
ఈ సోదాల్లో భారీ విలువైన ఆస్తులు, నగదు, బంగారం, వెండి, పెట్టుబడికి సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆస్తుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని హైదరాబాద్‌లోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (పీసీఎస్) విభాగంలో పనిచేస్తున్న డిఎస్పీ సంకిరెడ్డి భీమ్ రెడ్డిగా గుర్తించారు. సర్వీసులో ఉన్న సమయంలో అవినీతి, అక్రమ మార్గాల ద్వారా అపారమైన సంపదను కూడబెట్టారన్న ఆరోపణలపై, ‘అవినీతి నిరోధక చట్టం-1988’ (2018 సవరణతో సహా)లోని సెక్షన్లు 13(1)(బి), 13(2) కింద ఆయనపై కేసు నమోదు చేశారు. దాదాపు 20 చోట్ల స్థిరాస్తుల్ని గుర్తించడం కలకలం రేపింది.
బెంగళూరు మహానగరంలో భీంరెడ్డికి సంబంధించి ఎకరా వాణిజ్య స్థలం, కర్ణాటకలో 44 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు గుర్తించారు. ఆయన పేరిట లభించిన స్థిరాస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మరోవైపు హైదరాబాద్ శివార్లలోని ఓ మున్సిపాలిటీకి వైస్ ఛైర్మన్‌గా పని చేసిన నేత ఇంట్లోనూ ఏసీబీ సోదాలు జరిగాయి. భీంరెడ్డికి సదరు నేత సన్నిహితంగా మెలగడంతో ఆయన పేరిట ఏమైనా ఆస్తుల్ని దాచారా? అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం.
ఒక బినామీ ఇంట్లో రూ.40 లక్షల నగదు, వెసెల్లా మెడోస్‌లో ఏసీబీ సోదాల సమయంలో ఏకంగా 2 కిలోల బంగారు ఆభరణాలతో పాటు సుమారు 20 కిలోల వెండి వస్తువులు లభ్యమయ్యాయి. రూ.19.91 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నట్లు గుర్తించారు. 23 విదేశీ మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో ఆబ్కారీ శాఖకు సమాచారం అందించారు. రూ.3.6 లక్షల నగదుతో పాటు పేట్ బషీరాబాద్‌లోని ఓ బినామీ ఇంట్లో మరో రూ.40 లక్షల నగదు లభ్యమైంది.
మరో కంపెనీ నిర్వాహకుడు భీంరెడ్డికి బినామీగా ఉన్నట్లు వెల్లడైంది. భీంరెడ్డికి సంబంధించిన లాకర్ ఉన్నట్లు గుర్తించారు. ఒకవేళ దాని తాళం ఇవ్వడానికి నిరాకరిస్తే న్యాయస్థానం అనుమతితో తెరిచేందుకు ఏసీబీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. శ్రీ రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్ అనే సంస్థలో డీఎస్పీ రూ.75 లక్షల మేర పెట్టుబడి పెట్టినట్లు పత్రాలు లభ్యమయ్యాయి.
హైదరాబాద్ పరిసర ప్రాంతాలు సహా పక్క రాష్ట్రంలో భారీగా స్థిరాస్తులను నిర్మించారు. పలు చోట్ల స్థలాలతో పాటు వివిధ ప్రాంతాలలో సుమారు 45 ఎకరాల వ్యవసాయ భూములను గుర్తించారు.

More Stories
మూసీ ప్రక్షాళనపై క్యాబినెట్ లో మంత్రుల వాడీవేడి చర్చలు
నితిన్ నబిన్ పర్యటనతో రేవంత్ రెడ్డిలో భయాందోళనలు
తిరుమల తరహాలో యాదాద్రి అభివృద్ధి