
ప్రజలకు సేవ చేసేందుకు తాను మరో 30-40 ఏళ్లు జీవించాలని ఆశిస్తున్నట్లు టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా శనివారం చెప్పారు. ఆదివారం తన 90వ పుట్టిన రోజును దలైలామా జరుపుకోనున్నారు. తాజాగా ఆయన అనుచరులు దలైలామా దీర్ఘాయుష్షు కోసం పలు ప్రార్థనలు నిర్వహించారు. ఆ సమయంలో తనకు అవలోకితేశ్వరుడి ఆశీస్సులు ఉన్నాయని, తనకు అందుకు సంబంధించిన స్పష్టమైన సంకేతాలు, సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు.
“అనేక ప్రవచనాలను పరిశీలిస్తే, నాకు అవలోకితేశ్వరుడి ఆశీస్సులు ఉన్నాయని భావిస్తున్నాను. ఇప్పటి వరకు నా వంతు కృషి నేను చేశాను. ఇంకా నేను 30-40 ఏళ్లు జీవించాలని ఆశిస్తున్నాను. మీ ప్రార్థనలు ఇప్పటి వరకు ఫలించాయి. చిన్నప్పటి నుంచి నాకు, అవలోకితేశ్వరుడికి బలమైన సంబంధం ఉందని అనిపిస్తోంది. నేను ఇప్పటి వరకు బుద్ధ ధర్మానికి, టిబెట్ ప్రజల కోసం సేవ చేయగలిగాను. ఇంకా 130 సంవత్సరాలకు పైగా జీవించాలని ఆశిస్తున్నాను” అని చెప్పారు.
14వ దలైలామా 90వ పుట్టిన రోజును పురస్కరించుకుని, ప్రవాస టిబెటన్ ప్రభుత్వం వారం రోజులపాటు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వేడుకల్లో భాగంగా ప్రధాన ఆలయంలో దీర్ఘాయుష్షు ప్రార్థన కార్యక్రమం నిర్వహించారు. దీనికి 15వేల మందికిపైగా హాజరయ్యారు. వీరిలో భక్తులు, టిబెటన్ బౌద్ధమత ప్రతినిధులు, వివిధ మఠాల సీనియర్ లామాలు ఉన్నారు.
తాను స్వదేశాన్ని దేశాన్ని కోల్పోయి భారత్‌లో ప్రవాస జీవితం గడుపుతున్నానని, అయినప్పటికీ టిబెట్‌లోని ప్రజల కోసం చాలా మేలు చేయగలిగానని దలైలామా పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైనా నాయకుడు మావో జెడాంగ్ను తాను కలుసుకున్న విషయాన్ని దలైలామా గుర్తు చేసుకున్నారు. “మావో జెడాంగ్ ‘మతం ఒక విషం’ అని వ్యాఖ్యానించారు. కానీ నేను దానికి ప్రతిస్పందించలేదు. అతను మంచిని చెడుగా చూశాడు. కానీ అతనిపై నాకు కరుణ కలిగింది. తర్వాత నేను నెహ్రూను కలిశాను. నా జీవితాంతం మతం పట్ల ఆసక్తి ఉన్నవారిని, ఏమాత్రం ఆసక్తి లేనివారిని చాలా మందిని కలిశాను” అని దలైలామా గుర్తు చేసుకున్నారు.
“బౌద్ధమత గ్రంథాల ప్రకారం- ప్రజలు విభిన్న మానసిక స్వభావాలు, అభిరుచులు కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరూ ఆనందం కోసం ప్రయత్నిస్తారు. మతం లేదా విశ్వాసం లేనివారు కూడా ఆనందాన్ని పొందడానికి, బాధల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి, ఈ భూమిపై ఉన్న అందరూ, చివరకు టిబెటన్లు కూడా బాధలను కోరుకోరు” అని స్పష్టం చేశారు.
“వాస్తవానికి మనమందరం ఆనందాన్ని కోరుకుంటాం. ఈ కోణంలో చూస్తే మనమందరం ఒక్కటే. కనుక ఎవరి పద్ధతుల్లో వారు బాధలు తగ్గించుకుని, ఆనందం పొందడానికి కృషి చేయాలి” అని దలైలామా హితవు పలికారు.
More Stories
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!
ఐదేళ్లలో వెయ్యి కొత్త రైళ్లు.. 2027 నాటికి బుల్లెట్ రైలు
నకిలీ ఆధార్ కార్డుల తయారీలో బెంగాల్ లో నలుగురు అరెస్ట్