ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా కన్నుమూత

ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా కన్నుమూత
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు, నటుడు భార‌తీ రాజా (85) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 2025 మార్చిలో భారతీరాజా కుమారుడు మ‌నోజ్ భారతీ రాజా కేవలం 48 ఏళ్ల వయసులో గుండెపోటుతో అకాల మరణం చెందారు. 

ఈ విషాదాన్ని భారతీరాజా తట్టుకోలేకపోయారని కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెబుతుంటారు.  గత ఏడాది శ్వాసకోశ సంబంధిత సమస్యలు, ఉబ్బసం కారణంగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఆయనను ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. అనంతరం కోలుకున్న ఆయనకు వైద్యులు ఇంటి వద్దే విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.  

1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో మాయదేవర్, కరుత్తమ్మ దంపతులకు భారతీరాజా జన్మించారు. ఆయన అసలు పేరు చిన్నస్వామి. చిన్ననాటి నుంచే సాహిత్యం, వక్తృత్వ పోటీలు, రంగస్థల నాటకాలపై ఆసక్తి కనబరిచారు. కొంతకాలం స్వగ్రామంలో ఆరోగ్య పరిశీలకుడిగా పనిచేసిన ఆయనకు సినిమాలపై ఉన్న మక్కువ చెన్నైకు తీసుకొచ్చింది.  ఎన్నో కష్టాల తర్వాత దర్శకుడు పి. పుల్లయ్య వద్ద సహాయ దర్శకుడిగా అవకాశం దక్కించుకున్నారు.
అదే ఆయన సినీ ప్రయాణానికి బలమైన పునాది అయింది. 1977లో విడుదలైన 16 వ‌యాతినిలే (తెలుగులో ‘పదహారేళ్ల వయసు’) చిత్రంతో భారతీరాజా దర్శకుడిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు.  గ్రామీణ నేపథ్య కథలను సహజత్వంతో వెండితెరపై ఆవిష్కరించి తమిళ సినిమాకు కొత్త దిశను చూపించారు. గ్రామీణ జీవనశైలి, మానవ సంబంధాలు, భావోద్వేగాలను సహజంగా ఆవిష్కరించడం ఆయన చిత్రాల ప్రత్యేకతగా నిలిచింది. 
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.  దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగానూ భారతీరాజా ఎన్నో విభిన్న పాత్రలను పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల విడుదలైన తుడ‌రుం చిత్రంలో ఆయన చివరిసారిగా కనిపించారు. అలాగే ఆయన నటించిన పుల‌వ‌ర్ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఇదే నటుడిగా ఆయన చివరి సినిమా కానుంది.

‘సీతాకోకచిలుక’ చిత్రానికి తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం దక్కగా, 1981లో అదే చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు. 1986లో తెరకెక్కించిన ‘ముధల్ మరియాథై’ మూవీకి జాతీయ ఉత్తమ తమిళ సినిమా అవార్డు లభించింది. 1996లో ‘అంతిమంతారై’ సినిమాకు మరోసారి జాతీయ ఉత్తమ తమిళ సినిమా పురస్కారం దక్కింది. భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2004లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2014లో సైమా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేసి ఆయన కృషిని గౌరవించింది.