టీఎంసీకి ఎంపీ సుష్మితా దేవ్ రాజీనామా.. అస్సాం సీఎంతో భేటీ

టీఎంసీకి ఎంపీ సుష్మితా దేవ్ రాజీనామా.. అస్సాం సీఎంతో భేటీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్ అంతర్గత సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్నది. ఓ వైపు మమతా బెనర్జీపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించగా నేడు ఎంపీలు సైతం అదే బాటలో పయనిస్తున్నారు. మొన్నటికి మొన్న తృణమూల్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేశారు.  ఆ సంఘటన మరిచిపోక ముందే నేడు మరో ఎంపీ సుష్మితా దేవ్ కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.  
తన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్​ సీ.పీ. రాధాకృష్ణన్​కు సమర్పించారు.  సుష్మితా తన రాజీనామా లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు. “నేను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. దీనిని తక్షణమే ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. రాజ్యసభ సభ్యురాలిగా నా పదవీకాలంలో నాకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ సచివాలయ అధికారులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా” అని రాసుకొచ్చారు.
 
 కాగా, ఆమె రాజీనామా చేసిన కొద్దిసేపటికే ఢిల్లీలోని అస్సాం ముఖ్యమంత్రి హిమంత శర్మ నివాసంలో ఆయనతో పాటు సుష్మితా దేవ్ నవ్వుతున్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే విషయంపై ఓ విలేకరి ఎంపీ సుష్మితా దేవ్‌ను అస్సాంతో ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించగా కేవలం అస్సాంతో మాత్రమే సంబంధం ఉంది అని చమత్కరించారు.  
టీఎంసీలోకి చేరడానికి ముందు  53 ఏళ్ల సుష్మితాదేవ్​ కాంగ్రెస్‌లో ఉండేవారు. ఆమె తండ్రి, దివంగత సంతోశ్​ మోహన్ దేవ్, యూపీఏ-1 ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. సుష్మితా దేవ్ గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.  గ‌తంలో అఖిల భార‌త మ‌హిళా కాంగ్రెస్  చీఫ్‌గా చేశారామె. అస్సాంలోని సిల్చార్ నుంచి ఆమె గ‌తంలో ఎంపీగా చేశారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ నాయకత్వంతో విభేదించి, 2021లో ఆమె మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీలో చేరారు. 
 
తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన అతి తక్కువ కాలంలోనే ఆమెకు మమత పెద్దపీట వేశారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కీలక బాధ్యతలు అప్పగించడంతో పాటు పశ్చిమ బెంగాల్ వెలుపల పార్టీని బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా ఆమెకు రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా కట్టబెట్టారు.
ఈ వారం రోజుల్లోనే ఇద్దరు టీఎంసీ ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం. పార్టీని వీడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు త్వరలోనే ఎన్డీఏలో చేరనున్నట్లు సమాచారం.