అత్య‌ధిక కాలం ప్ర‌ధానిగా మోదీ.. కేంద్ర మంత్రివర్గం ప్రశంసలు

అత్య‌ధిక కాలం ప్ర‌ధానిగా మోదీ.. కేంద్ర మంత్రివర్గం ప్రశంసలు

* రాష్ట్రపతి ముర్ము శుభాకాంక్షలు  

అత్య‌ధిక కాలం ఎన్నికైన ప్ర‌ధానిగా కొనసాగడం ద్వారా నరేంద్ర మోదీ కొత్త రికార్డు సృష్టించారని, గ‌తంలో నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ఆయ‌న అధిగమించారని పేర్కొంటూ బిజెపి, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర క్యాబినెట్ బుధవారం ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై అత్య‌ధిక రోజులు ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన మోదీని ప్ర‌శంసిస్తూ తీర్మానం ఆమోదించింది. 

మంత్రులందరూ సమావేశంలో పాల్గొనగా, మోదీపై ప్ర‌శంస‌లు కురిపిస్తూ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ ప్ర‌క‌ట‌న చేశారు. ఆ త‌ర్వాత మంత్రులంద‌రూ లేచి నిల‌బ‌డి చ‌ప్ప‌ట్లు కొట్టారు. 2014 మే 26వ తేదీన దేశ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ప్ర‌ధానిగా పోటీ చేసిన ఆయ‌న ఘ‌న విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లోనూ భారీ మెజారిటీతో ప్ర‌ధాని పీఠాన్ని చేజిక్కించుకున్నారు. 

ఆ ఏడాది మే 30వ తేదీన ఆయ‌న మ‌ళ్లీ ప్ర‌ధాని బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇక మూడోసారి కూడా ప్ర‌ధానిగా 2024 జూన్ 9వ తేదీన మో దీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. గ‌తంలో మాజీ ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ 1947 నుండి తొలి ప్రధానిగా కొనసాగినప్పటికీ, రాజ్యాంగం అమలులోకి వచ్చి, తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత 1952లో ప్రధానిగా ఎన్నికై 4398 రోజుల పాటు కొనసాగారు. 

ఇప్పుడు ఆ రికార్డును మోదీ అధిగ‌మించారు. నేటితో 4399 రోజుల పాటు ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు నిర్వర్తించిన వ్య‌క్తిగా మోదీ ఘ‌న‌త సాధించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ స్పందిస్తూ, ప్రజాసేవ అనేది సుపరిపాలనకు అత్యంత పెద్ద పరీక్ష అని పేర్కొన్నారు. ఎక్స్​లో ఓ సంస్కృత శ్లోకాన్ని ఆయన పోస్టు చేస్తూ దాని భావాన్ని వివరించారు. వినయం, అంకితభావం, కర్తవ్య నిష్ఠ అనేవి ప్రజల నమ్మకాన్ని సంపాదించడానికి అవసరమైన సద్గుణాలు అని పేర్కొన్నారు.

“ప్రజాసేవ అనేది సుపరిపాలనకు అతిపెద్ద పరీక్ష. వినయం, అంకితభావం, కర్తవ్య నిష్ఠతో నిరంతరం పనిచేసే వ్యక్తి మాత్రమే ప్రజల విశ్వాసాన్ని పొందుతాడు. ‘సదనురక్తప్రకృతిః ప్రజాపాలనతత్పరః వినీతాత్మా హి నృపతిర్భూయసీ శ్రియమశ్నుతే’- దీని అర్థం ఏమిటంటే, ఎవరైతే ఎల్లప్పుడూ ప్రజల సంరక్షణకు అంకితమవుతారో, వినయపూర్వకమైన మనస్తత్వం కలిగిన ఆ పాలకుడే మరింత గొప్ప సంపదను, శ్రేయస్సును పొందుతాడు” అని తెలిపారు. 

కేంద్రంలో 12 ఏళ్ల పాటు ప్ర‌ధానిగా ఉన్న మోదీకి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము శుభాకాంక్ష‌లు తెలిపారు. అతిసుదీర్ఘ కాలం ఎన్నికైన ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన విశిష్ట గౌర‌వాన్ని పొందార‌ని ముర్ము తెలిపారు. భార‌త ప్ర‌జ‌లు మీ నాయ‌క‌త్వంపై ఉంచిన న‌మ్మ‌కానికి ఈ అసాధార‌ణ మైలురాయి ఓ ప‌రీక్ష‌గా నిలుస్తుంద‌ని, న‌మ్మ‌కానికి,  విశ్వాసాన్ని చాటుతుంద‌ని తెలుపుతూ ఎక్స్ లో రాష్ట్ర‌ప‌తి ముర్ము ఓ పోస్టు చేశారు. 

ప‌రిపాల‌న‌లో ఆధునీక‌ర‌ణ‌, ఆర్థిక స్థిర‌త్వం సాధించ‌డానికి నిద‌ర్శ‌నంగా ఆయన పాల‌న నిలుస్తుంద‌ని, ఆయన చేరుకున్న మైలురాయి బ‌ల‌మైన భార‌త ప్ర‌జాస్వామ్య సంప్ర‌దాయంలో కొత్త ఉత్స‌హాన్ని, విశ్వాసాన్ని ఇస్తుంద‌ని ముర్ము అభిలాషను వ్యక్తం చేశారు. 

ప్రధాని మోదీ సాధించిన ఈ ఘనతపై ఎన్​డీఏ నేతలతోపాటు, వివిధ దేశాల నేతలు, పలు రంగాల ప్రముఖులు నుంచి అభినందనలు తెలియజేశారు. మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ మాట్లాడుతూ, “మోదీ 12 ఏళ్ల పాలనా కాలాన్ని స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి” అని అభివర్ణించారు. వలస రాజ్యాల పాలన వల్ల భారతీయులలో నాటుకుపోయిన న్యూనతా భావాన్ని దూరం చేయడానికి మోదీ సర్కార్ చేసిన కృషిని ఆయన కొనియాడారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్​, మన్సుఖ్​ మాండవీయ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త సహా వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు బీజేపీ నేతలు ప్రధాని మోదీ తరఫున ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేవాలయాల్లో మోదీ తరఫున పూజలు నిర్వహించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్​ మాట్లాడుతూ, భారత్​లో అత్యధిక కాలం సేవలు అందించిన ఎన్నికైన ప్రధానిగా మోదీ నిలవడంపై ప్రశంసలు కురిపించారు.