హిమాచల్‌ప్రదేశ్‌ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు హిమాచల్‌ప్రదేశ్‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో హిమాచల్‌ప్రదేశ్‌కు భారీ ఆస్తి, ప్రాణ నష్టం ఏర్పడింది. బియాస్ సహా పలు నదులు ఉప్పొంగి ప్రవహించడంతో పలు ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
వరదలు కారణంగా ఇప్పటివరకు 63 మంది మరణించినట్లు సర్కార్ అధికారికంగా ప్రకటించింది. వరదల ధాటికి వంద మందికి పైగా గాయపడ్డారని, పదుల సంఖ్యలో పౌరులు వరదల్లో గల్లంతైనట్లు పేర్కొంది. వారికోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోన్నట్లు తెలిపింది. వరదల వల్ల దాదాపు రూ.400 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. పునరుద్ధరణ చర్యలపై ప్రాథమికంగా దృష్టి పెట్టినట్లు అధికారులు చెప్పారు.
జులై 7 వరకు హిమాచల్‌లోని అన్ని జిల్లాల్లో భారీ వర్ష సూచన హెచ్చరికలు చేసినట్లు తెలిపారు. నదీ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. బిలాస్‌పుర్, హమీర్‌పుర్, కిన్నౌర్, కుల్లు, సిర్మౌర్, సిమ్లా, సోలాన్, మండీ జిల్లాలో ప్రకృతి విలయతాండవం సృష్టించింది. హిమాచల్‌ప్రదేశ్ వ్యాప్తంగా వందల సంఖ్యలో ఇళ్లు కూలిపోగా, 14 వంతెనలు ధ్వంసమయ్యాయి. అనేక జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. 300కి పైగా పశుసంపద మృత్యువాత పడింది.
రాష్ట్రవ్యాప్తంగా 250 రోడ్లు నాశనం అవ్వగా, 500 ట్రాన్స్‌ఫార్మార్లు దెబ్బతిన్నాయి. దీంతో వేలాది మంది ప్రజలు చీకట్లో గడుపుతున్నారు. ఎడతెగని వర్షాలతో ప్రధానంగా మండీ జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. ఒక్క మండీ జిల్లాలోనే దాదాపు 17మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఒక్క జిల్లాలోనే 40కిపైగా మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ వర్షాల వల్ల మండి జిల్లాపై తీవ్ర ప్రభావం పడింది. కొండచరియలు విరిగిపడడంతో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. నీటి సరఫరా లేదు. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో బియాస్ నది సహా ప్రధాన నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. కాగా, ఆ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జులై 5న సిమ్లా, సోలన్, సిర్మౌర్, జులై 6న ఉనా, బిలాస్‌పూర్, హమీర్‌పూర్, కాంగ్రా, చంబా, మండి జిల్లాలల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా ప్రాంతలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఐఎండి హెచ్చరికలతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు.
More Stories
కోయంబత్తూరు పేలుళ్ల నిందితుడు 29 ఏళ్ళకు అరెస్ట్
యువతలో పెరుగుతున్న అక్యూట్ మైలోయిడ్ లుకేమియా
గుజరాత్లో వంతెన కూలి 10 మంది మృతి