
పాత వాహనాలకు ఇంధనం ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆదేశాలు జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. వాహన కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా 15 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం నుంచి ఉన్న పెట్రోల్ వాహనాలు, పది సంవత్సరాలకన్నా ఎక్కువ వాడకంలో ఉన్న పాత డీజిల్ వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిపడాన్ని అనుమతించేది లేదని ఢిల్లీ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది.
మంగళవారం నుంచి దానిని అమలు చేస్తున్నది. దీనికోసం దేశ రాజధానిలోని 500 పెట్రోల్ బంకుల్లో ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌పీఆర్) కెమెరా సిస్టమ్‌లను ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా 100 ప్రత్యేక బృందాలను ఢిల్లీ రవాణా శాఖ నియమించింది. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, సోనిపట్‌లకు ఈ నిషేధాన్ని విస్తరించనున్నారు.
అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి నేషనల్ క్యాపిటల్ రీజియన్ లోని మిగిలిన ప్రాంతాల్లో అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. పలు సాంకేతిక సమస్యల వల్ల పాత వాహనాలకు ఇంధన నిషేధం కష్టసాధ్యమని డిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా మీడియాకు తెలిపారు.
తమ వాహనాలను ఎంతో ప్రేమతో చూసుకునే వ్యక్తులకు కష్టం కలిగించే బదులు, సరిగా నిర్వహించని వాహనాలను స్వాధీనం చేసుకునే ఓ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాత వాహనాలను గుర్తించడంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని చెప్పారు. పెట్రోల్ బంకుల వద్ద ఏర్పాటు చేసిన ఏఎన్‌పీఆర్ కెమెరాలు సరిగ్గా పనిచేయడం లేదని తెలిపారు. కొత్త హై సెక్యూరిటీ ప్లేట్లను గుర్తించలేకపోతున్నాయని, వాహన వయసు ప్రకారం స్క్రాప్ చేయలేమని వెల్లడైందని వివరించారు.
కాలం చెల్లిన వాహనాలకుఇంధనం ఇవ్వకుండా తుక్కుకు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది ఢిల్లీలో 62 లక్షల వాహనాలపై ప్రభావం చూపేలా ఉంది. అయితే, పలువురు యజమానులు తమ వాహనాలు ఇంకా మంచి పరిస్థితిలో ఉన్నా కూడా తుక్కు అయ్యే పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక యజమాని తమ 16 ఏళ్ల మెర్సిడెస్ ఇప్పటికీ కొత్త కార్ల కంటే మెరుగ్గా ఉందని, అయినా తుక్కు అంటారా అంటూ ప్రశ్నించారు.
More Stories
కోయంబత్తూరు పేలుళ్ల నిందితుడు 29 ఏళ్ళకు అరెస్ట్
యువతలో పెరుగుతున్న అక్యూట్ మైలోయిడ్ లుకేమియా
గుజరాత్లో వంతెన కూలి 10 మంది మృతి