పాక్‌ సెలబ్రిటీల సోషల్‌ మీడియా ఖాతాలపై వేటు

పాక్‌ సెలబ్రిటీల సోషల్‌ మీడియా ఖాతాలపై వేటు

దాయాది పాకిస్థాన్‌కు చెందిన సెలబ్రిటీల సోషల్‌ మీడియా ఖాతాలను భారత్‌ మరోసారి బ్లాక్‌ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌కు చెందిన పలు మీడియా సంస్థల అకౌంట్లు, సెలబ్రిటీల సోషల్‌ మీడియా ఖాతాలను భారత్‌ విత్‌హెల్డ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. అయితే, బుధవారం ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో సోషల్‌ మీడియాలో పాక్‌కు చెందిన సెలబ్రిటీల ఖాతాలు, పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది.

నెటిజన్లు ఆయా ఖాతాలను బ్లాక్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు. గురువారం ఉదయం నుంచి పాకిస్థాన్‌కు చెందిన పలువురు ప్రముఖుల సోషల్‌ మీడియా ఖాతాలు భారత్‌లో కనిపించలేదు.  హనియా అమీర్‌, మహీరా ఖాన్‌, షాహిద్‌ అఫ్రిది, మావ్రా హొకేన్‌, ఫవాద్‌ ఖాన్‌ వంటి పాకిస్థానీ ప్రముఖుల ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ ప్రొఫైల్స్‌ గురువారం ఉదయం నుంచి అందుబాటులో లేకుండా పోయాయి.

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్‌ పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆ దేశానికి చెందిన పలువురు ట్విట్టర్ అకౌంట్లు, పలు యూట్యూబ్‌ ఛానళ్లపై నిషేధం విధించింది.  పాక్‌ ప్రభుత్వానికి చెందిన పలు సోషల్‌ మీడియా ఖాతాలను కూడా విత్‌హెల్డ్‌ చేసింది. అంతేకాదు, తప్పుడు, రెచ్చగొట్టే, సున్నితమైన మతపరమైన అంశాల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని పాకిస్థాన్‌ యూట్యూబ్‌ చానళ్లపై కూడా నిషేధం విధించింది.

ఇందులో పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అఖ్తర్‌కు చెందిన యూట్యూబ్‌ చానల్‌ కూడా ఉన్నది. హోం శాఖ సిఫారసు మేరకు డాన్‌ న్యూస్‌, జియో న్యూస్‌, సమా టీవీ, సునో న్యూస్‌, ది పాకిస్థాన్‌ రెఫరెన్స్‌ తదితర యూట్యూబ్‌ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది.