వెనుకబడిన తరగతులలో (బీసీ) ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నత స్థానాలకు చేరుకున్న కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలను నిరంతరం పొడిగించడంపై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలను లేవనెత్తింది. కోటా ద్వారా సామాజిక పురోగతి సాధించిన కుటుంబాలు, కాలక్రమేణా రిజర్వేషన్ వ్యవస్థ నుంచి వెలుపలికి రావాలని కోర్టు మౌఖికంగా అభిప్రాయపడింది.
ఫలాలు అందుకుని సామాజికంగా, ఆర్థికంగా ఉన్నతస్థితికి చేరిన కుటుంబాలు అదే కోటాను తరతరాలుగా కోరుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్‌లై ప్రభుత్వ సర్వీసుల్లో కొనసాగి స్థిరపడినప్పుడు, ఇక వారి పిల్లలకు రిజర్వేషన్ల కోటా అవసరమా?’’ అని సుప్రీం కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఓబీసీ క్రిమీలేయర్ (ధనికవర్గం) పరిమితులు, రిజర్వేషన్ల మినహాయింపులపై దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
జస్టిస్ బీవీ నాగరత్న మాట్లాడుతూ విద్య, ఆర్థిక సాధికారకత ద్వారా సమాజంలో ఒక స్థాయి వస్తుందని పేర్కొన్నారు. ‘‘తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ అధికారులు. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడి ఉన్నతస్థానానికి చేరుకుని, వారిలో సామాజిక పురోగతి స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి వారందరినీ రిజర్వేషన్ల నుంచి మినహాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. కానీ, ఆ మినహాయింపులను వారు సవాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా మనం మనసులో ఉంచుకోవాలి” అని ఆమె సూచించారు.
“రిజర్వేషన్ల ద్వారా ప్రయోజనం పొంది ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత కూడా వారి పిల్లల కోసం కోటాను ఆశించడం సరైంది కాదు. ఇలాగైతే రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి మనం ఎప్పటికీ బయటపడలేం. దీనిని తీవ్రంగా పరిగణించాల్సి ఉంది’’ అని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. ఈ కేసులో పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ లాయర్ శశాంక్ రత్నూ సదరు వ్యక్తులను వారి జీతం ఆధారంగా కాకుండా, వారి హోదా ఆధారంగా మినహాయించారని తెలిపారు.
దీనిపై లోతైన పరిశీలన అవసరమని, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కేటగిరీకి, క్రీమీలేయర్‌కు మధ్య స్పష్టమైన తేడా ఉండాలని కోరారు. దీనికి జస్టిస్ నాగరత్న స్పందిస్తూ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సామాజిక వెనుకబాటుతనం ఉండదని, కేవలం ఆర్థిక వెనుకబాటుతనం మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. అయితే, లాయర్ శశాంక్ ఈడబ్ల్యూఎస్ కంటే క్రీమీలేయర్ పరిమితి నిబంధనలు చాలా సరళంగా ఉండాలని, రెండింటినీ ఒకేలా చూస్తే వాటి మధ్య తేడా లేకుండా పోతుందని వాదించారు.
‘‘సామాజికంగా, విద్యాపరంగా ఒక వ్యక్తి వెనుకబడి ఉండొచ్చు కానీ, రిజర్వేషన్ల ప్రయోజనం ఉన్నత స్థానాలకు వెళ్లినప్పుడు వారి పిల్లల పరిస్థితి మారుతుంది. ఇక్కడ ఒక సమతౌల్యత అవసరం’’ అని కోర్టు ఉద్ఘాటించింది. అన్ని అవకాశాలను ఒకే కుటుంబంలో ఉన్నత వర్గాలే చేజిక్కించుకుంటే, అదే వర్గంలోని నిరు పేదలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.
సమాజంలో కేవలం కొందరికే రిజర్వేషన్ల ఫలాలు పరిమితం కాకూడదని, అట్టుడుగున ఉన్న వ్యక్తికి కూడా అందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా, 1992 నాటి ‘ఇంద్ర సాహ్ని’ (మండల్ కమిషన్) కేసులో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ల కోటాను సమర్థిస్తూనే, వారిలో ‘క్రీమీలేయర్’ వర్గాలను మినహాయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ప్రస్తుతం రూ. 8 లక్షల వార్షికాదాయంతో పాటు రాజ్యాంగబద్దమైన ఉన్నత పదవుల్లో ఉన్నవారు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి సీనియర్ అధికారులు, సైనికాధికారుల పిల్లలకు ఆదాయంతో సంబంధం లేకుండా క్రీమీలేయర్‌గా పరిగణించి రిజర్వేషన్ల కోటా నుంచి మినహాయిస్తున్నారు. ఈ మినహాయింపులను సవాల్ చేస్తూ పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ కేసులో కేంద్రం, ఇతర సంబంధిత వర్గాలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. రాబోయే రోజుల్లో క్రీమీలేయర్ నిబంధనలపై ఇచ్చే తీర్పు రిజర్వేషన్ల కోటాలో మరిన్ని సంస్కరణలకు దారితీసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

More Stories
వేగంగా ఆయుధ స్థావరాన్ని పునర్నిర్మిస్తున్న ఇరాన్
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు
ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాలలో భారత్ లో 50