ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల గోస మనందరికీ కనిపిస్తోందని చెబుతూ రైతుకు భరోసా ఇవ్వడానికి బీజేపీ సిద్ధమైందని బీజేఎల్పీ నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. సోమవారం నుంచి బీజేపీ ఎల్పీ తరఫున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో పర్యటించబోతున్నారని వెల్లడించారు. మొదటిరోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు సమక్షంలో కొనుగోలు కేంద్రాల్లో పర్యటిస్తామని తెలిపారు.
బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలిసి రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలను పర్యటించి వడ్ల కొనుగోలు ఎంత జరిగింది? జొన్నల కొనుగోలు ఎందుకు ప్రారంభించలేదు? మొక్కజొన్న కొనుగోలు ఎంతవరకు జరిగింది? అన్న విషయాలను ప్రజల ముందుకు తీసుకువస్తారని ఆయన వెల్లడించారు. రైతు సమస్యలను తెలుసుకోవడమే కాకుండా రైతులు పడుతున్న గోస పట్ల బీజేపీ భరోసాగా నిలబడుతుందని ఆయన చెప్పారు.
ఆరు కాలాలు కష్టపడి పండించిన పంటను కూడా అమ్ముకోలేని దుస్థితిలో తెలంగాణ రైతన్న ఉన్నాడని, దళారుల బారిన పడి మోసపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు జూన్‌లో వచ్చే రుతుపవనాలకు రైతులు మళ్లీ సిద్ధం కావాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు.
కానీ రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పనిచేయడం లేదని, లారీలు లేవని, గన్నీ బ్యాగులు లేవని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఇప్పటివరకు జొన్నల కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించకుండా ప్రభుత్వం రోజుకో ప్రకటన ఇస్తోందని ధ్వజమెత్తారు.
ఎన్నికల మేనిఫెస్టోలో 10 పంటలకు గిట్టుబాటు ధరతో పాటు ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. ప్రతి ఎకరానికి రూ.7,500 రైతు భరోసా ఇస్తామని చెప్పి, ఆ హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఇప్పుడు రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునే సమయంలో కూడా ఒక బస్తాకు అదనంగా 4 కిలోలు కోత పెడుతున్నారని బిజెపి నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొక్కజొన్న పూర్తిగా కొనుగోలు చేయలేని పరిస్థితి వాస్తవం కాదా? గన్నీ బ్యాగుల కోసం రైతులు వేచి ఉండటం వాస్తవం కాదా? జొన్నల కొనుగోలు కేంద్రాలు లేక రైతులు యార్డుల్లోనే కుప్పలు వేసుకుని అక్కడే కాపలా కాస్తున్న పరిస్థితి వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని చెప్పడం పూర్తిగా తప్పుదారి పట్టించే ప్రయత్నం అంటూ మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
.“సీఎం రేవంత్ రెడ్డి గారు…!! మీకు అధికారులు ఏ లెక్కలు చెప్పారు? నిజంగా 80 శాతం కొనుగోళ్లు జరిగి ఉంటే, మీరు ఎక్కడికి తీసుకెళ్లినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. లేకపోతే మీరు మా వెంట రండి, మేమే వాస్తవ పరిస్థితులు చూపిస్తాం” అని సవాల్ చేశారు. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 24 శాతం మాత్రమే వడ్ల కొనుగోలు జరిగిందని స్పష్టం చేశారు.
సుమారు 1.41 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తే, గత సంవత్సరం కేవలం 90 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు.
ఈ ఏడాది కూడా అదే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటివరకు ఎంత కొనుగోలు చేశారు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారే 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని చెప్పారని పేర్కొంటూ వారి లెక్కలనే నిజమని తీసుకున్నా కూడా అది 30-35 శాతం మాత్రమే అవుతుందని చెప్పారు. మరి ఏ లెక్కలు 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని చెబుతున్నారు? అంటూ నిలదీశారు.
యూరియా బస్తాల దగ్గర నుంచి గన్నీ బ్యాగుల వరకు, పంట అమ్ముకునే దశ వరకు ప్రతి చోట దోపిడీ జరుగుతోందని, మిల్లర్లు దోచుకుంటున్నారని, దళారులు దోచుకుంటున్నారని బీజేఎల్పీ నేత ఆవేదన వ్యక్తం చేశారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలు జరిగితే, అందులో 10 శాతం అంటే 9 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఎవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయి? ఈ వేల కోట్ల రూపాయల దందా ఎవరి కోసం జరుగుతోంది? అని ప్రశ్నించారు.
More Stories
సంఘ్లో ఏమి నేర్పినా అవన్నీ దేశం కోసమే
వేగంగా ఆయుధ స్థావరాన్ని పునర్నిర్మిస్తున్న ఇరాన్
రేజర్వేషన్లు కొన్ని కుటుంబాలకే నిరంతరం.. సుప్రీం ప్రశ్నలు!