కార్గిల్ విజయ్ దివస్.. వీర జవాన్లకు బండారు దత్తాత్రేయ నివాళి

కార్గిల్ విజయ్ దివస్.. వీర జవాన్లకు బండారు దత్తాత్రేయ నివాళి

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భారత మాత కోసం తమ ప్రాణాలను అర్పించిన  వీర జవాన్లకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఘన నివాళులర్పించారు. 1999లో పాకిస్తాన్ చొరబాటుదారులు కార్గిల్ ప్రాంతంలోని భారత భూభాగంలో అక్రమంగా చొరబడి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేసినప్పుడు, అప్పటి ప్రధానమంత్రి  అటల్ బిహారీ వాజ్‌పేయి  దృఢ సంకల్పంతో భారత సైన్యం ముఖ్యంగా భారత వాయుసేన “ఆపరేషన్ విజయ్”ను విజయవంతంగా నిర్వహించి శత్రువులను తరిమికొట్టి, తిరిగి భారత త్రివర్ణ పతాకాన్ని కార్గిల్ శిఖరాలపై రెపరెపలాడించిందని ఆయన గుర్తు చేశారు.

అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు, ఎత్తైన పర్వత శిఖరాలు, ప్రాణాలను సైతం లెక్కచేయని ధైర్యసాహసాలతో మన వీర జవాన్లు పోరాడి సాధించిన ఈ విజయం భారత సైనిక చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడటంలో భారత సైన్యం చూపిన పరాక్రమం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్న సైనికులకు, వారి కుటుంబాలకు దేశ ప్రజలందరూ అండగా నిలవాలని  దత్తాత్రేయ పిలుపునిచ్చారు. వారి త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, ప్రతి భారతీయుడు వారికి రుణపడి ఉంటాడని చెప్పారు.  దేశ భద్రత కేవలం సైన్యానికే పరిమితం కాదని, సమాజం కూడా అప్రమత్తంగా, ఐక్యంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

కులం, మతం, భాష, ప్రాంతం అనే భేదాలకు అతీతంగా “భారతదేశం నా మాతృభూమి – దాని రక్షణ నా బాధ్యత” అనే భావన ప్రతి భారతీయుడిలో బలపడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పాశం సాయి కృష్ణ యాదవ్,  ఆర్ శేషసాయి, వంశీ కృష్ణల నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో   సి మోహన్,   కౌడిన్య ప్రసాద్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.