అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికైన ప్రధానమంత్రి, హోంమంత్రిని లోక్‌సభలో ప్రతిపక్ష నేత ‘దేశద్రోహి’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అంటూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది నమ్మకంతో ఓటేసి గెలిపించిన వారిపై రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన మానసిక స్థితిని, ఆయన అసహనాన్ని తెలియజేస్తోందని ధ్వజమెత్తారు. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతుండటంతో మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారనిపిస్తోందని మండిపడ్డారు.
ఒక పార్టీ జెండాతో గెలిచి వేరే పార్టీలోకి ఫిరాయించిన దానం నాగేందర్‌పై సుప్రీం కోర్టు అనర్హత వేటు వేయడాన్ని స్వాగతించి, క్షమాపణలు చెప్పాల్సింది పోయి అదేరోజు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పడం హాస్యాస్పదం అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వేరే పార్టీల టికెట్లపై ఎన్నికైన 10 మంది ఎమ్మెల్యేలను రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌లోకి చేర్చుకున్నారని గుర్తు చేశారు.
ప్రజల నమ్మకాన్ని గెలుచుకోలేకపోవడంతో ఎన్నికల్లో ఓడిపోతూ నిరాశ నిస్పృహలకు గురవుతున్న కాంగ్రెస్ నాయకులు, రాహుల్ గాంధీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రజలు వీరిని ఛీత్కరించినప్పుడల్లా ఏం చేయాలో పాలుపోక రాజ్యాంగబద్ధ సంస్థలపై వారి అసహనాన్ని వెల్లగక్కుతున్నారని మండిపడ్డారు.
అవినీతి నాయకులపై ఈడీ, సీబీఐలు విచారణ జరిపితే కూడా కాంగ్రెస్ గగ్గోలు పెడుతూ విచారణ సంస్థల దుర్వినియోగం జరుగుతోందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. నిజంగానే విచారణ సంస్థలను దుర్వినియోగం చేసేదే నిజమైతే ‘నేషనల్ హెరాల్డ్’ కేసులో రాహుల్ గాంధీ బెయిల్‌పై బయట ఎందుకు తిరుగుతున్నారో ఓసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు చెప్పారు.
ఎస్ఐఆర్ నిర్వహించిన చోట ‘ఓట్ చోరీ’ ద్వారా బీజేపీ గెలిచిందంటూ రాహుల్ గాంధీ ఆరోపిస్తూ రాగా, వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ నిర్వహించిన తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రాలేదని, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా నకిలీ ఓటర్లను తొలగించడం తమ పార్టీకి ప్రయోజనం జరిగిందని కేరళకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే బహిరంగంగానే వ్యాఖ్యానించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్లో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించిన 20 నియోజకవర్గాల్లో టీఎంసీ 13 స్థానాల్లో గెలిచిందని, బీజేపీ ఆరు స్థానాల్లో మాత్రమే గెలిచిందని చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియ బీజేపీ కుట్ర అయితే ఎస్ఐఆర్ నిర్వహించిన ప్రాంతాల్లో బీజేపీ ఎందుకు మెజారిటీ స్థానాల్లో గెలవలేదు? అని ప్రశ్నించారు.
More Stories
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణపతి
దీనదయాళ్ కు దత్తాత్రేయ ఘనంగా నివాళులు
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి 27న హాజరుకై ఈడీ సమన్లు