* పీవోకే మినహా పాక్ తో మరే అంశంపై చర్చలుండవు
1999 నాటి కార్గిల్ సంఘర్షణ సమయం నుండి చొరబాటుదారుల “ఉద్దేశ్యం” ఏమాత్రం మారలేదని చెబుతూ ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి భారత సైన్యం “పూర్తిగా సిద్ధంగా” ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ద్రాస్‌లో ఏర్పాటు చేసిన ‘శౌర్య భోజ్’ కార్యక్రమంలో సైనిక సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, సాయుధ దళాల ఆధునీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, సైన్యానికి అత్యాధునిక పరికరాలు, అత్యుత్తమ శిక్షణ లభించేలా కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
కార్గిల్ విజయ్ దివస్ వార్షికోత్సవం సందర్భంగా చేపట్టిన రెండు రోజుల కార్యక్రమాల్లో భాగంగా, ఇక్కడి కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద నిర్వహించిన ‘శౌర్య సంధ్య’ కార్యక్రమంలో పాల్గొనేందుకు సింగ్ శనివారం సాయంత్రం ద్రాస్‌కు చేరుకున్నారు. 1999 జూలై 26న ‘ఆపరేషన్ విజయ్’ విజయవంతంగా ముగిసిన సందర్భాన్ని కార్గిల్ విజయ్ దివస్ సూచిస్తుంది.
కార్గిల్ జిల్లాలో పాకిస్థాన్ దళాలు ఆక్రమించిన భారత భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సైన్యం ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. “నేటికీ సవాళ్లు తగ్గలేదని, చొరబాటుదారుల ఉద్దేశ్యం మారలేదని, వారు ఇప్పటికీ ప్రాక్సీ యుద్ధం లేదా చొరబాటు వంటి పద్ధతులను అనుసరిస్తున్నారని మనం గుర్తుంచుకోవాలి,” అని పాకిస్థాన్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన తెలిపారు.
“అటువంటి సవాళ్లను ఎదుర్కోవడానికి మన సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని నాకు పూర్తి నమ్మకం ఉంది,” అని సింగ్ చెప్పారు. ఇది “మన శతాబ్దం, రాబోయే కాలం మనదే” అని పేర్కొన్న రక్షణ మంత్రి, ‘ఆత్మనిర్భరత’ (స్వయం సమృద్ధి)పై ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా, “భారత సాయుధ దళాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా ఎదుగుతాయని నాకు నమ్మకం ఉంది” అని పేర్కొన్నారు.
తన ప్రసంగంలో ఆయన సాయుధ దళాలకు మరియు సైనికుల వీరత్వానికి సెల్యూట్ చేశారు. “కార్గిల్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయినప్పటికీ, ఆక్సిజన్ స్థాయిలు తగ్గినప్పటికీ మన సైనికులు తమ అప్రమత్తతను ఏమాత్రం తగ్గించలేదు. అందుకే ఈ రోజు మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటూ, తలెత్తుకుని జీవించగలుగుతున్నాము,” అని సింగ్ తెలిపారు.
ఈ సందర్భంలో ద్రాస్‌లో తనకు కలుగుతున్న గర్వభావం మాటల్లో వర్ణించలేనిదని సింగ్ పేర్కొన్నారు. భారత సైనికులలో అదృశ్య అంతర్గత శక్తి, దేశభక్తి భావన ఉన్నంత కాలం, “ప్రపంచంలోని ఏ శక్తీ భారతదేశంపై దుష్ట దృష్టి సారించడానికి సాహసించదు” అని తనకు నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు. “గత కొన్నేళ్లుగా సైన్యానికి సంబంధించిన అనేక సంప్రదాయాలను దగ్గరగా చూసే అవకాశం నాకు లభించింది. వాటిలో హృదయానికి అత్యంత హత్తుకునేది ‘బడా ఖానా’ (సైనికులందరూ కలిసి చేసే విందు),” అని మంత్రి చెప్పారు.
జవాన్, అధికారి కలిసి కూర్చుని ఒకే రకమైన భోజనం చేసే ఏకైక సందర్భం ఇదేనని, ఇది అద్భుతమైన సమష్టి కృషి స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ఆయన చెప్పారు. “సమాజంలోని పరిమితులను అధిగమించగల మీ సామర్థ్యమే మీ నిజమైన బలం. కార్గిల్ వంటి యుద్ధాల్లో విజయం సాధించడానికి మనకు ఈ బలమే దోహదపడుతుంది,” అని సింగ్ పేర్కొన్నారు
కాగా, పీవోకే పైన మినహా పాకిస్థాన్‌తో భవిష్యత్తులో మరే అంశంపైన చర్చలు ఉండవని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. భారత్ ఇన్నోవేషన్, స్టార్టప్‌లు, స్పేస్ మిషన్ల వైపు అడుగులు వేస్తుంటే పాకిస్థాన్ మాత్రం చొరబాటు మార్గాలను వెతుక్కుంటోందని ఎద్దేవా చేశారు. మనం డేటా సెంటర్లను నిర్మిస్తుంటే వాళ్లు ఉగ్రవాద కేంద్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. పాకిస్థాన్‌తో చర్చలంటూ జరిగితే అది పీవోకే కోసమే తప్ప మరే విషయంలోనూ జరగబోవని పేర్కొన్నారు.
1999లో కార్గిల్ యుద్ధంలో దేశం సాధించిన విజయాన్ని భారతమాత కిరీటంలో పొదిగిన వజ్రంగా అభివర్ణించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని తమ దేశ విధానంలో ఒక భాగంగా మార్చుకుందని రాజ్‌నాథ్ సింగ్ దుయ్యబట్టారు. ఉగ్రవాదులను అడ్డు పెట్టుకొని భారత్‌ను బెదిరించడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందో ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రపంచమంతా చూసిందని గుర్తు చేశారు. పాక్ చేసే ఏ దుస్సాహస చర్యకైనా వారి ఊహకందని రీతిలో మన సైన్యం ప్రతిస్పందిస్తుందని రక్షణ మంత్రి హెచ్చరించారు.
ఉరి సెక్టార్ దాడి తర్వాత జరిపిన సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా తర్వాత వైమానిక దాడులు, పహల్గాం దాడుల అనంతరం ఆపరేషన్ సిందూర్.. ఇలా ఉగ్రవాద చర్యలపై భారత్ తీవ్రంగా స్పందించిందని గుర్తుచేశారు. 27వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఇతర ఆర్మీ అధికారులు అమరవీరులకు నివాళులర్పించారు.

More Stories
ఐదుగురు బెంగాల్ పోలీస్ అధికారులపై వేటు
అస్సాం, గుజరాత్ లలో వరదల బీభత్సం… వంద మందికి పైగా మృతి
కార్గిల్ .. యుద్దభూమి నుండి ఆత్మనిర్భర్ వరకు భారత్ సైనిక ప్రయాణం