ఐదుగురు బెంగాల్ పోలీస్ అధికారుల‌పై వేటు

ఐదుగురు బెంగాల్ పోలీస్ అధికారుల‌పై వేటు

పశ్చిమ బెంగాల్‌లో గత ప్రభుత్వ హయాంలో పక్షపాత ధోరణితో వ్యవహరించారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసు అధికారులపై వేటు వేస్తూ ప్రభుత్వం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి సువేందు అధికారి స్వయంగా ఈ విషయాన్ని అసెంబ్లీలో వెల్లడించారు.

సస్పెన్షన్‌కు గురైన వారిలో సీనియర్ ఐపీఎస్ అధికారి కోటేశ్వరరావు కూడా ఉన్నారు. గతంలో డైమండ్ హార్బర్ ఎస్పీగా విధులు నిర్వర్తించిన ఈయన, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడని సమాచారం. వీరితోపాటు కాళీయాగంజ్ పోలీస్ స్టేషన్ మాజీ ఇన్‌స్పెక్టర్ అజ్జం హుస్సేన్, బర్తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్-ఇన్-చార్జ్ సుబర్ణ దత్తా చౌదరి, అదే స్టేషన్‌కు చెందిన ఎస్సై సాధన్ పాండే, కృష్ణానగర్ పోలీస్ స్టేషన్ మాజీ ఇన్‌స్పెక్టర్ అమలేందు బిస్వాస్‌లపై వేటుపడింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సువేందు అధికారి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో (2021-2026) పోలీసు వ్యవస్థను అనేక చోట్ల దుర్వినియోగం చేశారని, సనాతన ధర్మాన్ని అనుసరించేవారి మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. అవినీతిపై తమ ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని కఠినంగా అమలు చేస్తుందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

ఇదిలాఉంటే, గతంలోనే బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ హత్యాచారం కేసు దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారన్న ఆరోపణలపై ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి సస్పెన్షన్ కాలాన్ని ప్రభుత్వం తాజాగా మరో 120 రోజుల పాటు పొడిగించింది. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ చర్యల ద్వారా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.