కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పుకొంటూ ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆమోదించారు. ప్రధాని సూచన మేరకు రాష్ట్రపతి ధర్మేంద్ర రాజీనామాకు ఆమోదం తెలిపారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు రాష్ట్రపతి ఒకప్రకటనలో పేర్కొన్నారు.
ధర్మేంద్ర రాజీనామా నేపథ్యంలో ఆయనకు విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రహ్లాద్ జోషికి ఉన్న శాఖలతోపాటు విద్యాశాఖను కూడా ఆయన పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం ప్రహ్లాద్ జోషి వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖలకు మంత్రిగా కొనసాగుతున్నారు.
అలాగే, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్‌కు ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. తాజా రాజకీయ పరిణామాలు విద్యా వ్యవస్థతోపాటు పరీక్షల నిర్వహణలో మార్పులకు దోహదం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రహ్లాద్ జోషి కర్ణాటకలోని ధార్వాడ్ నుంచి 2004 నుండి ఎంపీగా కొనసాగుతున్నారు. తాత్కాలిక విద్యాశాఖ మంత్రిగా తనను నియమించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన జోషి, బాధ్యతాభావంతో, వినమ్రతతో ఈ బాధ్యతను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
గత 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని కూడా ఆయన తెలిపారు. “గత నాలుగైదు ఏళ్లలో ధర్మేంద్ర ప్రధాన్ జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంతో పాటు అనేక కీలక కార్యక్రమాలను చేపట్టారు. కొత్త విద్యా విధానం ద్వారా దేశం గణనీయమైన పురోగతిని సాధించింది. ప్రధాన మంత్రి మార్గదర్శకత్వంలో, నా శక్తిమేర కృషి చేస్తూ అంకితభావంతో నా బాధ్యతలను నిర్వర్తిస్తాను,” అని ఆయన పేర్కొన్నారు.
ఇక, ప్రస్తుత పరిస్థితుల్లో విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నీట్ పరీక్ష నిర్వహించే ఎన్‌టీయేను ప్రక్షాళన చేయాలి. దేశ విద్యా వ్యవస్థతోపాటు పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తేవాలి. ముఖ్యంగా దేశ యువతలో పరీక్షల నిర్వహణపై కోల్పోయిన విశ్వాసాన్ని పెంపొందించాలి. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా ఎన్‌టీయేలోని 47 మంది అధికారుల్ని తొలగించినట్లు సమాచారం. ఇదే జరిగితే, మళ్లీ కొత్తవారిని నియమించాలి.

More Stories
నలుగురు బాలికలపై అత్యాచారం.. పాస్టర్కు నాలుగు మరణశిక్షలు
జల వివాదాలపై చర్చలకు అమిత్ షాకు దక్షిణ రాష్ట్రాల మద్దతు
పాలనలో కుత్రిమ మేధను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలి