250 మంది బంగ్లా వలసదారులు ఢాకాకు తరలింపు

250 మంది బంగ్లా వలసదారులు ఢాకాకు తరలింపు
సుమారు 250 మంది బంగ్లాదేశ్‌ అక్రమ వలసదారులను గుజరాత్‌ పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. తాళ్లతో వారి చేతులు కట్టేసి ప్రత్యేక విమానంలో ఢాకా తరలించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్‌తో పాటు పలు నగరాల్లో బంగ్లాదేశ్‌ జాతీయులు వేల సంఖ్యలో అక్రమంగా నివసిస్తున్నారు. గత రెండు నెలల్లో సుమారు 12,000 మంది అక్రమ వలసదారులను బంగ్లాదేశ్ కు పంపించి వేశారు.
 
వీరిని గుర్తించడానికి గత కొన్ని రోజులుగా స్థానిక పోలీసులతో కలిసి అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. కేంద్ర నిఘా సంస్థల సమహాకారంతో వారిని గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వందలాది మంది బంగ్లాదేశ్‌ జాతీయులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చాలా మంది నకిలీ ఆధార్, పాన్‌ కార్డులు కలిగి ఉన్నట్లు తెలుసుకున్నారు. 
 
జూలై 3న సుమారు 250 మంది బంగ్లాదేశ్‌ అక్రమ వలసదారుల చేతులను తాళ్లతో కట్టేశారు. గట్టి భద్రత మధ్య వడోదర ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌కు వారిని తీసుకెళ్లారు.  అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢాకా తరలించారు. బంగ్లాదేశ్‌ అక్రమ వలసదారుల చేతులను తాళ్లతో కట్టి విమానం ఎక్కించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల చేతులు, కాళ్లు కట్టేసి ప్రత్యేక విమానాల్లో భారత్‌కు పంపిన సంఘటనను ఇది గుర్తుచేసింది.