మణిపూర్‌‌లో దంపతులు సహా ముగ్గురు కుకీలు మృతి

మణిపూర్‌‌లో దంపతులు సహా ముగ్గురు కుకీలు మృతి
మణిపూర్‌‌లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ గ్రామంపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన దాడుల్లో ఓ మహిళతో సహా ముగ్గురు కుకీలు ప్రాణాలు కోల్పోయారు. కుకీ తెగ ఆధిపత్యం ఉండే కాంగ్‌పోక్పి జిల్లా లోయిబోల్ ఖుల్లెన్ అనే చిన్న గ్రామంలో గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపి ముగ్గురిని హత్య చేశారు. ఏడు ఇళ్లకు నిప్పు పెట్టారు. 
 
ఈ ఘటనపై కుకీ సంస్థ అయిన కుకీ ఇన్పి మణిపూర్‌ (‌కెఐఎం). నాగా గ్రూప్‌‌నే ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆరోపించింది. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగలిమ్ (ఎన్‌ఎస్‌‌సిఎన్‌) ‌గ్రూపు సభ్యులు, ఎన్‌ఎస్‌‌పిఎన్‌ అనుబంధ గ్రూప్‌ ‌జెలియాంగ్‌ ‌రాంగ్‌ ‌యునైటెడ్‌ ఫ్రంట్‌‌ ఈ దాడులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించింది.  ‘ఈ హేయమైన హింసాకాండలో లెట్ఖోంగమ్ హావోకిప్ (34), ఆయన భార్య టిన్మరీ హావోకిప్ (30), జాంగ్మిన్లాల్ హావోకిప్ (30) అనే ముగ్గురు అమాయక పౌరులు దారుణ హత్యకు గురయ్యారు. ఏడు ఇళ్లు బూడిదయ్యాయి. పౌరుల ఆస్తులకు గణనీయమైన నష్టం వాటిల్లింది’ అని కెఐఎం ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
అమాయకులను హత్య చేయడం, ఇళ్లను, జీవనోపాధులను ధ్వంసం చేయడం మానవ గౌరవానికి, ప్రాథమిక మానవ హక్కులను ఉల్లంఘించడమేనని విమర్శించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి, దోషులను పట్టుకుని శిక్షించాలని, న్యాయం త్వరగా జరిగేలా కేంద్రం, భద్రతా సంస్థలు దర్యాప్తు చేయాలని కెఐఎం విజ్ఞప్తి చేసింది.  అలాగే గ్రామాలను కాపాడటానికి, అమాయక పౌరులపై మరిన్ని దాడులు జరగకుండా నిరోధించడానికి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కెఐఎం ప్రకటనలో కోరింది.
స్థానిక స్వతంత్ర ఎమ్మెల్యే హావోఖోలెట్ కిప్‌జెన్ ఈ ఘటనను ఖండించారు. గ్రామాల రక్షణకు, దాడులను అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర బలగాలు చర్యలు తీసుకోవాలి డిమాండ్‌ ‌చేశారు.  బాధిత కుటుంబాలకు సహాయం అందించాలి, దోషులు కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. నాగాలు, కుకీల మధ్య ఇటీవల ఉద్రిక్తతలు పెరిగాయి. మే 13న చర్చికి సంబంధించిన ముగ్గురు హత్యకు గురయ్యారు.
14 మంది కుకీ గ్రామస్తులు మూడు వారాలకు పైగా నాగాల వద్ద బందీలుగా ఉన్నారు, అపహరణకు గురైన ఆరుగురు నాగా పురుషులు అదే కాలం నుండి ఆచూకీ లేకుండా పోయారు.  నాగ కుటుంబాలకు కలిసేందుకు ఉఖ్రుల్ నుండి కాంగ్‌పోక్పి జిల్లాలోని కుకీలు అధికంగా ఉండే గ్రామానికి పాదయాత్ర ప్రారంభించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. 
కాగా, మణిపూర్‌లో ఆయుధాల స్మగ్లింగ్ ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేసి, భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. తొలుత, భద్రతా దళాలు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (పంబేయి)కు చెందిన ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకుని, భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో ఏకే-సిరీస్ రైఫిళ్లు, ఎం-సిరీస్ రైఫిళ్లు, పిస్టళ్లు, ఇతర తుపాకులతో సహా 29 ఆయుధాలు, యుద్ధ సామగ్రి ఉన్నాయి. 
 
తరువాత జరిపిన మరిన్ని దాడులలో, ఏకే-సిరీస్ రైఫిళ్లు, ఎం-సిరీస్ రైఫిళ్లు, ఒక స్నైపర్ రైఫిల్, కార్బైన్లు, షాట్‌గన్‌లు, మోర్టార్లు, ఒక ఆర్‌పిజి-7 లాంచర్, ఒక యాంటీ-డ్రోన్ జామ్మర్, భారీగా పేలుడు పదార్థాలతో సహా 38 ఆయుధాలు మరియు భారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.