మారుతి ఎండీగా విదేశీ పౌరురాలు సోనియా గాంధీ!

* మారుతి కార్ అసలు యజమానురాలు సోనియా…  నిషికాంత్ దుబే
 
1970ల నాటి మారుతి ప్రాజెక్టుకు సంబంధించిన కంపెనీలో ఆమె యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం గాంధీ కుటుంబానికి అనుకూలంగా వ్యవహరించిందని  బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే  ఆరోపించారు. ‘కాంగ్రెస్ చీకటి అధ్యాయం’ అనే శీర్షికతో ఎక్స్ లో ప్రసారమవుతున్న తన 250వ ఎపిసోడ్‌లో దుబే మాట్లాడుతూ, సోనియా గాంధీ అప్పట్లో విదేశీ పౌరురాలు అయినప్పటికీ మారుతి టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంటిఎస్)కు డైరెక్టర్, వాటాదారు అయ్యారని పేర్కొన్నారు. 
 
ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆ కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని కూడా ఆయన ఆరోపించారు. “విదేశీ పౌరురాలు అయినప్పటికీ, సోనియా గాంధీ మారుతికి మేనేజింగ్ డైరెక్టర్, 50 శాతం వాటాదారుగా ఉన్నారని మీకు తెలుసా? భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఏ విదేశీ పౌరుడూ భారతీయ కంపెనీకి డైరెక్టర్ కాకూడదు కదా? మరి ఆమె 1970లో డైరెక్టర్ ఎలా అయ్యారు?” అని ఆయన ప్రశ్నించారు. 
 
1977లో ఒక విచారణ కమిషన్ పరిశీలించిన సంజయ్ గాంధీ మారుతి ప్రాజెక్టు చుట్టూ నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 1970 నవంబర్ 21న సంజయ్ గాంధీ, సోనియా గాంధీకి చెందిన మారుతి టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని దుబే పేర్కొన్నారు. అధికారికంగా స్థాపించక ముందే ఆ కంపెనీ ప్రభుత్వ మద్దతును ఎలా పొందిందని ఆయన ప్రశ్నించారు.
 
“1970 నవంబర్ 21న, సంజయ్ గాంధీ, సోనియా గాంధీకి చెందిన మారుతి టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. మారుతికి అసలైన యజమాని సోనియా గాంధీ. మారుతి కంపెనీ 1970లో స్థాపించారు. కానీ కార్లను తయారు చేయడానికి అధికారం ఇస్తూ భారత ప్రభుత్వం నుండి అది అప్పటికే 1968లో ఒక లేఖను పొందింది,” అని ఆయన పేర్కొన్నారు.
 
“1969లో, ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తన కోడలు సోనియా గాంధీ కంపెనీకి కార్లను తయారు చేయడానికి అనుమతిస్తూ ఒక క్యాబినెట్ ఉత్తర్వు జారీ చేశారు. 1972 ఏప్రిల్ 3న, సంజయ్ గాంధీ భారత ప్రభుత్వ ఖర్చుతో ఆ కంపెనీ తరపున ప్రపంచవ్యాప్తంగా పర్యటించారు,” అని ఆయన జోడించారు. 
 
ఆ కంపెనీ ఏర్పాటులో, అప్పట్లో ఇందిరా గాంధీ నేతృత్వం వహించిన ప్రధానమంత్రి కార్యాలయం కూడా పాత్ర పోషించిందని దుబే ఆరోపించారు. గాంధీకి అత్యంత సన్నిహితుడు, ప్రైవేట్ సెక్రటరీ అయిన ఆర్.కె. ధావన్‌కు కూడా దీనితో సంబంధం ఉందని చెబుతూ “ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక ప్రైవేట్ కంపెనీ కార్యాలయం ఎలా ప్రారంభించారు? ప్రధానమంత్రి ప్రైవేట్ సెక్రటరీ అయిన ధావన్ దానికి డైరెక్టర్ ఎలా అయ్యారు?” అని ఆయన ప్రశ్నించారు. 
 
మారుతి ప్రాజెక్టుకు భూమి కేటాయింపుపై కూడా దుబే ప్రశ్నలు లేవనెత్తారు. హర్యానా ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీయుడి పేరు మీద భూమిని కేటాయించడానికి వీలులేదని ఆయన స్పష్టం చేశారు. “ఆనాటి హర్యానా ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీయుడి పేరు మీద భూమిని కేటాయించడానికి వీలు లేదు, అయినా 1970లో సోనియా గాంధీకి భూమిని కేటాయించారా?” అని ఆయన నిలదీశారు. 
 
గాంధీ కుటుంబంతో సంబంధం ఉన్న కంపెనీలకు రుణాలు సులభతరం చేయడానికే ఈ చర్య తీసుకున్నారా అని ప్రశ్నిస్తూ, ఈ వివాదాన్ని బ్యాంకుల జాతీయీకరణకు కూడా ఈ బీజేపీ ఎంపీ ముడిపెట్టారు. “ఆమె కంపెనీలకు రుణాలు అందించడానికే కదా బ్యాంకుల జాతీయీకరణ జరిగింది?” అని ఆయన ప్రశ్నించారు. ఆ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించక ముందే, బస్సు బాడీల నిర్మాణం కోసం మారుతికి ముందస్తు చెల్లింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారని కూడా ఆయన ఆరోపించారు.
 
ప్రభుత్వ కంపెనీలు ఎలాంటి చెల్లింపులు స్వీకరించకుండానే మారుతికి సిమెంట్, స్టీల్, బొగ్గును సరఫరా చేశాయని ఆరోపిస్తూ, పారిశ్రామిక సామగ్రి సరఫరాను కూడా దుబే ప్రశ్నించారు. “ప్రభుత్వ కంపెనీలు ఎలాంటి చెల్లింపులు లేకుండా నేరుగా మారుతికి సిమెంట్, స్టీల్, బొగ్గును ఎలా సరఫరా చేశాయి?” అని ఆయన ప్రశ్నించారు. తన పోస్ట్‌ను ముగిస్తూ, కంపెనీ స్థాపన, కార్యకలాపాల చుట్టూ ఉన్న పరిస్థితులను వివరించాలని దుబే సోనియా గాంధీకి సవాలు విసిరారు. 
 
ప్రభుత్వ మద్దతు, ప్రత్యేక ప్రాధాన్యత పొందుతూ, గాంధీ కుటుంబం చెప్పుకోదగ్గ వ్యక్తిగత పెట్టుబడి లేకుండా ఇంత పెద్ద వ్యాపార సంస్థను ఎలా నిర్మించిందని ఆయన ప్రశ్నించారు. “సోనియాజీ తన సొంత డబ్బు పెట్టుబడిగా పెట్టకుండా ఇంత పెద్ద కంపెనీని ఎలా నిర్మించారో, ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మారుతి కంపెనీని ఆమెకు అనుగ్రహంగా ఎలా అప్పగించారో తన పుస్తకంలో వివరిస్తే బాగుండు,” అని ఆయన ఎద్దేవా చేశారు. 

 

 

About The Author