ప్రపంచ శాంతికి సాంస్కృతిక సామరస్యమే పునాది

ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఘర్షణలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ శాంతి, శ్రేయస్సుకు నాగరికతల మధ్య సంభాషణలు, పరస్పర సామరస్యమే బలమైన పునాదిగా నిలుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సామ్రాజ్యాలు ప్రపంచ పటాలను మార్చి ఉండొచ్చని, కానీ నాగరికతల మధ్య సంభాషణలు ప్రపంచ ఆలోచనలను మార్చి, మరింత సుసంపన్నం చేశాయని పేర్కొన్నారు. 

షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) తొలి నాగరికతల సంభాషణ వేదిక కేవలం ఆచారప్రాయమైన కార్యక్రమంగా మిగిలిపోకూడదని, ప్రపంచానికి దిశానిర్దేశం చేసే వేదికగా ఎదగాలని ప్రధాని ఆకాంక్షించారు. న్యూఢిల్లీలోని చారిత్రక పురానా ఖిలాలో మూడు రోజుల పాటు జరగనున్న ఎస్‌సీఓ నాగరికతల సంభాషణ వేదికను మోదీ శుక్రవారం ప్రారంభించారు. 

భద్రత, ఆర్థిక వ్యవస్థ, అనుసంధాన రంగాల్లో ఎస్‌సీఓ సహకారం ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిందని మోదీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సాంస్కృతిక, నాగరికతల పరమైన సహకారం సభ్య దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. ఈ వేదిక నుంచి కొత్త ఆలోచనలు, సాంస్కృతిక సహకారానికి కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయని, ఉమ్మడి నాగరికతా అనుభవాలు ప్రపంచాన్ని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

భారతీయ సంస్కృతిలోని ‘వసుధైక కుటుంబకం’ భావనను ప్రధాని ప్రస్తావిస్తూ  ప్రపంచమంతా ఒకే కుటుంబమనే దృక్పథాన్ని భారతీయ సంస్కృతి బోధిస్తుందని చెప్పారు. వ్యక్తిగత సంక్షేమం కోరుకోవడం సహజమే అయినప్పటికీ, అది ప్రపంచ సంక్షేమం అనే విస్తృత ఆకాంక్షలో భాగమై ఉంటుందని వివరించారు. పరస్పర సామరస్యమే ప్రపంచ శ్రేయస్సుకు పునాది అని స్పష్టం చేశారు. దేశాల మధ్య శాంతియుత సహజీవనం, సహకారం ద్వారానే సమష్టి అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఎస్‌సీఓ సభ్య దేశాల్లోని మ్యూజియంలు, గ్రంథాలయాలు, ఆర్కైవ్‌లలో వేల సంవత్సరాల చరిత్రకు సంబంధించిన విలువైన వారసత్వ సంపద భద్రంగా ఉందని మోదీ తెలిపారు. పురాతన గ్రంథాలు, అరుదైన పుస్తకాలు, చారిత్రక పత్రాలు, కళాఖండాలు ఆయా దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను, నాగరికతల అనుబంధాలను తెలియజేస్తాయని పేర్కొన్నారు. ఈ సంపదను భవిష్యత్‌ తరాలకు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో అవకాశాలను కల్పించిందని తెలిపారు.

పురాతన గ్రంథాలను డిజిటలైజ్‌ చేయడం, వివిధ భాషల్లోకి అనువదించడం, ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా సభ్య దేశాలు తమ భాగస్వామ్య చరిత్రలోని కొత్త అంశాలను వెలికితీయవచ్చని సూచించారు. దీనివల్ల ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్న యువత అయినా మరో దేశపు సాంస్కృతిక వారసత్వాన్ని మరింత సులభంగా అర్థం చేసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. 

చారిత్రక విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతోపాటు సభ్య దేశాల ప్రజల మధ్య సాంస్కృతిక అవగాహనను పెంపొందించవచ్చని వివరించారు. 21వ శతాబ్దపు సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక అనుసంధానానికి కొత్త మార్గాలను తెరిచిందని మోదీ పేర్కొన్నారు. పూర్వీకులు నెలల తరబడి ప్రయాణించాల్సిన మార్గాల్లోని దేశాల ప్రజలు ఇప్పుడు కేవలం కొన్ని క్షణాల్లోనే పరస్పరం అనుసంధానమవుతున్నారని వివరించారు. 

డిజిటల్‌ వేదికల ద్వారా జ్ఞానాన్ని పంచుకోవడం, సాంస్కృతిక మార్పిడి, అంతర్జాతీయ సహకారం గతంలో ఎన్నడూ లేనంత సులభమయ్యాయని చెప్పారు. ఈ అవకాశాలను ఎస్‌సీఓ సభ్య దేశాలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నాగరికతల మధ్య సంభాషణలు ఆలోచనలను సుసంపన్నం చేయడమే కాకుండా, ఉమ్మడి ప్రపంచ అవగాహనకు దోహదపడతాయని మోదీ అన్నారు. ఈ వేదిక నుంచి కొత్త ఆలోచనలు, సాంస్కృతిక సహకారానికి అవకాశాలు ఏర్పడాలని ఆకాంక్షించారు.

ఎస్‌సీఓ పరిధిలో ప్రత్యేకంగా నాగరికతల సంభాషణ వేదికను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను 2025లో చైనాలోని టియాంజిన్‌లో జరిగిన ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అనంతరం ఈ ప్రతిపాదనకు ఎస్‌సీఓ బిష్కెక్‌ ప్రకటనలో స్వాగతం లభించింది. దాని కొనసాగింపుగానే తొలి నాగరికతల సంభాషణ వేదికకు భారత్‌ ఆతిథ్యమిస్తోంది.

ఈ బహుళపక్ష కార్యక్రమంలో ఎస్‌సీఓ సభ్య దేశాలతోపాటు పరిశీలక దేశాలు, సంభాషణ భాగస్వామ్య దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ కూడా ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. పాకిస్థాన్‌ ఫెడరల్‌ మంత్రి ముసాదిక్‌ మసూద్‌ మాలిక్‌ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేకతగా నిలిచింది.

భారతీయ కళా వైభవాన్ని చాటే ప్రదర్శనలు

ప్రారంభోత్సవంలో ‘నాగరికతల సంభాషణ–సాంస్కృతిక ప్రదర్శన’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగీతం, నృత్యం, దృశ్య కథనం, వ్యాఖ్యానాల సమ్మేళనంగా ఈ ప్రదర్శనను రూపొందించారు. ‘వసుధైక కుటుంబకం–ప్రపంచమంతా ఒకే కుటుంబం’ ఇతివృత్తంతో భారత్‌, యూరేషియా ప్రాంతాల మధ్య ఉన్న సాంస్కృతిక సంబంధాలను ఇందులో ఆవిష్కరించనున్నారు.

భారతీయ పురావస్తు, కళా, సాహిత్య వారసత్వాన్ని పరిచయం చేసే ప్రదర్శనలకు కూడా ఏర్పాట్లు చేశారు. ‘అస్తిత్వ–మన ఉనికి సారం’ పేరుతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఢిల్లీ చరిత్రను పురావస్తు ఆధారాలతో వివరించనున్నారు. క్రీస్తుపూర్వం 1200 నుంచి క్రీస్తుశకం 1200 వరకు ఉన్న చారిత్రక ఆనవాళ్లు ఇందులో చోటు చేసుకోనున్నాయి. 

తవ్వకాల్లో బయటపడిన అవశేషాలు, పురాతన వస్తువులు, నిర్మాణ సంబంధిత శకలాలు, ఇతర కీలక పురావస్తు ఆధారాలను సందర్శకులకు అందుబాటులో ఉంచనున్నారు. ‘మహాభారత స్క్రోల్‌ పెవిలియన్‌–అనంత్‌’ పేరుతో 18వ శతాబ్దానికి చెందిన అరుదైన మహాభారత చిత్రపట చుట్టను కూడా ప్రదర్శించనున్నారు. భారతీయ ఇతిహాస, చిత్రకళా సంప్రదాయాల గొప్పదనాన్ని చాటేలా ఈ ప్రదర్శనను రూపొందించారు.

21, 22 తేదీల్లో నాలుగు అంశాలపై చర్చలు

నవంబర్‌ 21, 22 తేదీల్లో ఈ వేదికలో నాలుగు ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. సంగీతం, ప్రదర్శన కళలు, వస్త్ర సంప్రదాయాలు, వంటకాలు, సాంప్రదాయ క్రీడలు వంటి సాంస్కృతిక వ్యక్తీకరణలపై ఒక అంశంగా చర్చించనున్నారు. కళలు, వాస్తుశిల్పంలో ఉమ్మడి సంప్రదాయాలు; భాషలు, లిపులు, సాహిత్య సంప్రదాయాలు, ప్రాచీన గ్రంథాలు; మఠాలు, ఆశ్రమాల చారిత్రక మార్గాలు, తాత్విక సంప్రదాయాలు ఇతర అంశాలుగా ఉంటాయి.

సభ్య దేశాల మధ్య పరస్పర సాంస్కృతిక అవగాహనను పెంపొందించడం, అనుసంధానమైన చరిత్రను తెలుసుకోవడం, ఉమ్మడి వారసత్వాన్ని పరిరక్షించేందుకు సహకారాన్ని విస్తరించడం ఈ వేదిక ప్రధాన ఉద్దేశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

 

About The Author