* సింధ్‌ను ముట్టుకుంటే కరాచీలో రక్తపాతమే!
దాదాపు ఐదు దశాబ్దాలలో పాకిస్తాన్ రాజకీయ పటం తన మొదటి పెద్ద మార్పు దిశగా పయనిస్తోంది. ఈ ఒత్తిడి ఒక రాజకీయ నాయకుడి నుండి కాకుండా, దేశంలోని శక్తివంతమైన సైనిక వ్యవస్థ నుండి వస్తుండటం రాజకీయ ప్రకంపనలకు దారితీస్తుంది. సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ పాకిస్తాన్‌లోని నాలుగు ప్రావిన్సులను చిన్న పరిపాలనా విభాగాలుగా విభజించాలని కోరుకుంటున్నారు.
దీనిపై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ తీవ్రంగా స్పందిస్తూ ప్రజల ఆమోదం లేకుండా సింధ్‌ను విభజించేందుకు ప్రయత్నిస్తే కరాచీ వీధుల్లో రక్తపాతం తప్పదని హెచ్చరించారు. పాకిస్థాన్‌లో అతిపెద్ద నగరమైన కరాచీ ఆ దేశ ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందింది. వాణిజ్యం, పరిశ్రమలు, బ్యాంకింగ్, నౌకాశ్రయాలు, ఆర్థిక కార్యకలాపాలకు ఈ నగరం కీలక కేంద్రం. సింధ్ ప్రావిన్స్‌లో భాగంగా ఉన్న కరాచీపై పరిపాలనా నియంత్రణ రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరింప చేసుకుంది.
2008 నుంచి సింధ్‌లో పీపీపీ వరుసగా అధికారంలో కొనసాగుతోంది. దీంతో ఆ పార్టీకి ఈ ప్రావిన్స్‌లో బలమైన రాజకీయ పునాది ఏర్పడింది. కరాచీని సింధ్ నుంచి వేరు చేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే ప్రావిన్స్ రాజకీయ సమీకరణాలు మారడంతోపాటు పీపీపీ ప్రభావం తగ్గే అవకాశం ఉందన్నది ఆ పార్టీ ఆందోళన కరాచీలో సింధీలు, మొహాజిర్లు (భారత విభజన సమయంలో భారత్ నుంచి వలస వెళ్లిన ఉర్దూ మాట్లాడే ప్రజలు), పఠాన్లు, పంజాబీలు, బలూచీలు సహా అనేక సామాజిక వర్గాలు నివసిస్తున్నాయి. వీటికి వేర్వేరు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి.
రాష్ట్ర విభజన అంశం ఈ వర్గాల మధ్య ఇప్పటికే ఉన్న విభేదాలను మళ్లీ తెరపైకి తీసుకురావచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 1980, 1990 దశకాల్లో కరాచీలో చోటుచేసుకున్న జాతి, రాజకీయ ఘర్షణలు, ప్రాణనష్టం ఈ భయాలకు చారిత్రక నేపథ్యంగా నిలుస్తున్నాయి. మొహాజిర్ల మద్దతు ఉన్న ముత్తహిదా ఖౌమీ మూవ్‌మెంట్–పాకిస్థాన్ (ఎంక్యూఎం–పీ) కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు పలుకుతోంది. దీంతో సింధ్ విభజన అంశం రాజకీయంగానే కాకుండా సామాజికంగానూ అత్యంత సున్నితంగా మారింది.
పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై చర్చకు తెరతీశారు. ప్రస్తుత పరిపాలనా వ్యవస్థలో మార్పులు అవసరమని, చిన్న రాష్ట్రాల ఏర్పాటు ద్వారా పాలనను మరింత సమర్థంగా నిర్వహించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. నవంబర్ 12న ఈ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) నిర్వహించాలన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు.
దీనికి కొనసాగింపుగా ప్రణాళికా శాఖ మంత్రి అహ్సన్ ఇక్బాల్ నవంబర్ 18న 14 రాష్ట్రాల నమూనా చర్చల్లో ఉందని వెల్లడించారు. ప్రతిపాదిత నమూనా ప్రకారం పంజాబ్‌ను నాలుగు రాష్ట్రాలుగా, సింధ్‌ను నాలుగు రాష్ట్రాలుగా, ఖైబర్ పఖ్తున్‌ఖ్వాను మూడు రాష్ట్రాలుగా, బలూచిస్థాన్‌ను మూడు రాష్ట్రాలుగా ఏర్పాటు చేస్తారు. అదనంగా ఇస్లామాబాద్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించే అంశంపైనా చర్చ జరుగుతోందని తెలిపారు.
2027 మార్చిలో జరగనున్న సెనేట్ ఎన్నికలకు ముందే కొత్త పరిపాలనా వ్యవస్థపై స్పష్టత రావచ్చన్న చర్చ కూడా సాగుతోంది. పీపీపీ పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వంలో అధికార భాగస్వామిగా ఉన్నప్పటికీ.. కొత్త రాష్ట్రాల అంశం రెండు పార్టీల మధ్య విభేదాలకు దారితీసింది. ఈ ప్రతిపాదనపై తనతోగానీ, తన తండ్రి, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతోగానీ సరైన సంప్రదింపులు జరగలేదని బిలావల్ ఆరోపించారు.

More Stories
మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు
తిరుపరన్కుండ్రంలో 24న దీపాలు వెలిగించేందుకు `సుప్రీం’ అనుమతి
తమిళనాడు పెట్టుబడుల వివరాలు ఆంధ్రాకు లీక్?