రాజస్థాన్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీపై నిర్ణయాత్మక విజయాన్ని సాధించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం, కాంగ్రెస్ 3,701 పంచాయతీ సమితి స్థానాలను గెలుచుకోగా, బీజేపీ 2,181 స్థానాలకే పరిమితమైంది. అలాగే, జిల్లా పరిషత్ స్థానాల్లో కాంగ్రెస్ 599 చోట్ల విజయం సాధించగా, అధికార బీజేపీ 301 స్థానాలను మాత్రమే దక్కించుకుంది.
డిసెంబరులో ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ప్రభుత్వం మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్న తరుణంలో, ఈ ఫలితాలు బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. ఓట్ల లెక్కింపు జరిగిన 37 జిల్లాల్లో, 33 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే ఎక్కువ పంచాయతీ సమితి స్థానాలను కైవసం చేసుకోగా, కేవలం నాలుగు జిల్లాల్లో మాత్రమే బీజేపీ ఆధిక్యంలో నిలిచింది.
శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, మొత్తం 37 జిల్లాల్లోని 7,543 పంచాయతీ సమితి స్థానాలకు గాను 7,393 స్థానాల ఫలితాలు, అలాగే 1,275 జిల్లా పరిషత్ స్థానాలకు గాను 981 స్థానాల ఫలితాలు వెల్లడయ్యాయి. జైపూర్‌లో కాంగ్రెస్ బలమైన ప్రదర్శన కనబరిచి, 216 పంచాయతీ సమితి స్థానాలను గెలుచుకోగా, బీజేపీ 87 స్థానాలను మాత్రమే దక్కించుకుంది.
జోధ్‌పూర్‌లో కాంగ్రెస్ 195 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 81 స్థానాలకే పరిమితమైంది. అలాగే, భిల్వారాలో 165 (బీజేపీ 111), బికనేర్‌లో 155 (బీజేపీ 65), దౌసాలో 135 (బీజేపీ 59), సికార్‌లో 179 (బీజేపీ 87) స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ సొంత జిల్లా భరత్‌పూర్‌లో, కాంగ్రెస్ 46 పంచాయతీ సమితి స్థానాలను గెలుచుకోగా, బీజేపీ 32 స్థానాలను దక్కించుకుంది.
హోం శాఖ సహాయ మంత్రి జవహర్ సింగ్ బెధమ్ సొంత జిల్లా అయిన ‘డీగ్’లో, కాంగ్రెస్ పార్టీ 25 స్థానాలను గెలుచుకోగా, బీజేపీ 14 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇతర పార్టీల విషయానికొస్తే, నాగౌర్ ఎంపీ హనుమాన్ బెనివాల్‌కు చెందిన రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ 496 పంచాయతీ సమితి స్థానాలను, 37 జిల్లా పరిషత్ స్థానాలను గెలుచుకుంది. భారత్ ఆదివాసీ పా 276 పంచాయతీ సమితి, 22 జిల్లా పరిషత్ స్థానాలను కైవసం చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థులు 627 పంచాయతీ సమితి, 10 జిల్లా పరిషత్ స్థానాలను గెలుచుకున్నారు.
ఈ ఫలితాలపై స్పందించిన రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రైతులు, కూలీలు, మహిళలతో సహా గ్రామీణ ఓటర్లు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. “ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం, నెరవేర్చని హామీలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన సందేశం ఇది” అని ఆయన తెలిపారు.
బీజేపీ ప్రతినిధి రామ్ లాల్ శర్మ మాట్లాడుతూ, పార్టీ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని అంగీకరించారు. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకు ముందు, పార్టీ ఈ ఫలితాలను సమీక్షించి, లోపాలను గుర్తించి, తగిన సరిదిద్దే చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.

More Stories
పాక్ మంత్రి తాజ్ సందర్శనకు అనుమతి నిరాకరణ
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం
తిరుపరన్కుండ్రంలో 24న దీపాలు వెలిగించేందుకు `సుప్రీం’ అనుమతి