టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేలతో 23 మంది ఎంపీల మంతనాలు!

టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేలతో 23 మంది ఎంపీల మంతనాలు!
* హడావుడిగా కార్యవర్గాన్ని మార్చిన మమతా 

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ రెబల్ గ్రూప్ ఎమ్మెల్యలతో 23 మంది ఎంపీలు ప్రస్తుతం సంప్రదింపులు సాగిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు తాజాగా పేర్కొంటున్నాయి. దీంతో రాబోయే రోజుల్లా టీఎంసీ పార్లమెంటరీ విభాగం నిట్టనిలువుగా చీలిపోయే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. 
పార్టీ బహిష్కృత నేత రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా 57 మంది టీఎంసీలు ఎమ్మెల్యేలు ఇటీవల ఎన్నుకున్నారు. ఆ ఎన్నికను స్పీకర్ రతీంద్ర బోస్ కూడా గుర్తించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు మమతా బెనర్జీని గౌరవిస్తున్నామని చెబుతూనే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ నాయకత్వాన్ని మాత్రం ఒప్పుకునేది లేదని కరాఖండిగా చెబుతున్నారు. తాజాగా టీఎంసీ ఎంపీల్లోనూ అసంతృప్తి పెల్లుబుకుతోంది. అభిషేక్ బెనర్జీ పట్ల పలువురు అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పార్లమెంటరీ ప్రత్యేక కూటమిగా ఏర్పాటేందుకు వీరు చర్చలు జరుపుతున్నారని, 12 మందికి పైగా ఎంపీలు ఇందుకు సముఖంగా ఉన్నారని అంటున్నాయి. టీఎంసీ పార్లమెంటరీ ప్రత్యేక కూటమిగా ఏర్పడేందుకు, చీలక తెచ్చేందుకు తగిన సంఖ్యాబలంపై కూడా చర్చ జరుగుతోందని చెబుతున్నారు. టీఎంసీకి లోక్‌సభలో ప్రస్తుతం 29 మంది ఎంపీలు ఉన్నారు. ప్రత్యేక గ్రూపుగా ఏర్పడి ఫిరాయింపుల చట్టం నుంచి వేటుపడకుండా ఉండాలంటే కనీసం 23 మంది మద్దతు ఇందుకు అవసరమవుతుంది.

రాజ్యసభ పరంగా చూస్తే టీఎంసీకి 13 మంది ఎంపీలున్నారు. ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందాలంటే కనీసం 9 మంది ఎంపీలు కలిసిరావాలి. ఈ పరిణామాలపై రెబల్ నేత రీతాబత్ర బెనర్జీని ప్రశ్నించగా, గత వారం రోజుల్లో తాను ఏ ఎంపీతోనూ మాట్లాడలేదని, అందువల్ల వాళ్లు ఏమి చేయాలనుకుంటున్నారో తనకు తెలియదని, అయితే రేపటిరోజు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరని పేర్కొన్నారు.

దీనిపై రాజ్యసభ ఎంపీ సుఖేందర్ శేఖర్ రాయ్ మాట్లాడుతూ, ఇంత తక్కువ సమయంలో 60 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం ఎప్పుడూ చూడలేదని, అదే స్పందన లోక్‌సభలోనూ ఉండే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ మాట్లాడుతూ, ఎగువ సభలో (రాజ్యసభ) పార్టీ పరిస్థితి “సురక్షితంగా” ఉన్నప్పటికీ, లోక్‌సభ విషయంలో మాత్రం అలా చెప్పలేమని తెలిపారు.

“ఇంత తక్కువ వ్యవధిలో దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడటం నేనెప్పుడూ చూడలేదు. లోక్‌సభలో కూడా ఇలాంటి పరిణామమే చోటుచేసుకునే అవకాశం ఉంది” అని చెప్పారు.  ఒక సీనియర్ టిఎంసి ఎంపీ మాట్లాడుతూ, “పార్లమెంటరీ పార్టీలో చీలిక అనేది ఇక కేవలం సమయం ఆసన్నం కావడమే మిగిలి ఉంది. ఇప్పటికే దాదాపు 20 మంది ఎంపీలు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మాకు తెలిసింది. ఈ సంఖ్య మరింత పెరగవచ్చు” అని పేర్కొన్నారు.

మరోవంక, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల తిరుగుబాట్లు, ఆ తర్వాత తన ఎంపీలలో త్వరలో పార్టీ చీలిపోతుందనే వదంతులు పెరగడంతో, తన వర్గాన్ని ఐక్యంగా ఉంచుకోవాలనే తీవ్ర ప్రయత్నంలో భాగంగా టీఎంసీ  అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం పార్టీలో భారీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణను ప్రకటించారు. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పార్టీని తన విధేయులు, పాతతరం నాయకులతో నింపారు. 
 
విస్తృత విమర్శలు ఎదురవుతున్నప్పటికీ మమతా తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగించారు. ఆయనకు సహాయపడటానికి రాజ్యసభ ఎంపీలైన డెరెక్ ఓ’బ్రియన్, డోలా సేన్‌లను ఇద్దరు సంయుక్త జాతీయ కార్యదర్శులుగా నియమించారు. ఈ నిర్ణయం అభిషేక్ ఏకపక్షంగా కాకుండా, అందరూ కలిసి తీసుకుంటారని తిరుగుబాటుదారులకు ఆమె సంకేతం ఇచ్చారు. 
 
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, కోల్‌కతాలోని టీఎంసీ అధినేత కాళీఘాట్ నివాసంలో కొద్దిమంది నాయకులు మాత్రమే హాజరైన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రతా బక్షి స్థానంలో మాజీ మంత్రి, మమతా విధేయురాలు అయిన చంద్రమా భట్టాచార్యను నియమించడం ద్వారా పార్టీ తన పశ్చిమ బెంగాల్ విభాగాన్ని కూడా పునర్‌వ్యవస్థీకరించారు. అనుబంధ సంస్థలలో, నటిగా ఉండి ఎంపీగా మారిన సయోని ఘోష్‌ను తృణమూల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగించగా, మాలా రాయ్‌ను పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించారు.