వర్షపాతం 90 శాతంకు తగ్గే అవకాశం

వర్షపాతం 90 శాతంకు తగ్గే  అవకాశం

ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) శుక్రవారం వెల్లడించింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా రుతుపవన వర్షపాతం దీర్ఘకాల సగటు (ఎల్‌‌పిఎ)లో 90 శాతంగా ఉండే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది. గత నెల ఏప్రిల్‌‌లో సగటు వర్షపాతం 92 శాతంగా ఉండే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది. 

అయితే ఏప్రిల్‌లో‌ వేసిన అంచనా కంటే తాజాగా వేసిన వర్షపాతం తగ్గడం గమనార్హం. ఎల్‌‌నినో సమయంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడి, అవి వర్షపాతంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ ఏడాది జూన్‌లో ఎల్‌‌నిన్‌ ఏర్పడి  సీజన్ ద్వితీయార్థంలో రుతుపవనాలు బలపడతాయని అంచనా వేస్తున్నట్లు ఐఎమ్‌డి తెలిపింది.  దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవన కాలంలో కురిసే వర్షపాతం, దీర్ఘకాల సగటు (ఎల్‌‌పిఎ)లో 90 శాతంగా ఉండే అవకాశం ఉంది.

సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని సూచిస్తున్నట్లు శుక్రవారం ఐఎండి మీడియాకు వెల్లడించింది. ఇక ఏడాది ఈశాన్య భారతదేశంలో సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.  ఈ సారి వర్షపాతం 90 శాతం కంటే తక్కువగా ఉండటానికి దాదాపు 60 శాతం అవకాశం ఉందని పేర్కొన్న ఐఎండి, దీనిని ‘లోటు వర్షపాతం’గా వర్గీకరించింది.

అయితే, దేశంలో ‘కరువు’ పరిస్థితిని ప్రకటించడానికి నిర్దిష్ట ప్రమాణాలు ఏవీ లేవని, తాము కేవలం లోటు వర్షపాతం ఉంటుందా లేదా అనే విషయాన్ని మాత్రమే అంచనా వేయగలమని స్పష్టం చేసింది.  ఇక వాయువ్య, మధ్య, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో సాధారణం కంటే తక్కువ రుతుపవన వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది.

జూన్‌‌లో ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌‌గఢ్‌, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, తెలంగాణ, హిమాచల్‌‌ప్రదేశ్‌, తమిళనాడు రాష్ర్టాల్లో అక్కడక్కడా అధిక వడగాలుల రోజులు నమోదయ్యే అవకాశం ఐఎండి తెలిపింది.  ఈ ఏడాది వర్షపాతం తగ్గడం వల్ల అది వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికీ 47 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడుతున్నారు. వ్యవసాయానికి అననుకూల పరిస్థితులు ఏర్పడడం వల్ల గ్రామీణ ఆర్థిక పరిస్థితిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని ఐఎండి సూచించింది.

ఈ ఏడాది నైరుతి రుతువపవనాలు మే 26నే కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండి ఇటీవల  ప్రకటించినా ప్రస్తుతం అవి జూన్ మొదటి వారంలో కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. రుతుపవనాలు ఇప్పటికే భారతదేశపు దక్షిణ సముద్ర జలాల్లోకి ప్రవేశించినప్పటికీ, అక్కడ నెలకొన్న అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా ముందుకు విస్తరించలేకపోయాయని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం. రవిచంద్రన్ వివరించారు.