2026లో తమిళనాడు, బెంగాల్‌లలో ఎన్‌డీఏ ప్రభుత్వాలు

2026లో తమిళనాడు, బెంగాల్‌లలో ఎన్‌డీఏ ప్రభుత్వాలు

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో  ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని  కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తమిళనాడులోని మదురైలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి బీజేపీ ఆఫీస్ బేరర్లతో ఏర్పాటు చేసిన ‘కార్యకర్త సమ్మేళన్‌’లో ప్రసంగిస్తూ మధురై‌ను మార్పునకు ప్రతీకగా నిలిచే నగరంగా అమిత్‌షా అభివర్ణించారు. 

తమిళనాడులోని అధికార పీఠం నుంచి డీఎంకేను గద్దె దించడానికి బీజేపీ ‘కార్యకర్త సమ్మేళన్‌’తో నాంది పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ – అన్నా డీఎంకే కలిసి ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని తమిళనాడులో ఏర్పాటు చేస్తాయని కేంద్ర హోంమంత్రి విశ్వాసం వెలిబుచ్చారు.  డీఎంకే సర్కారు పాలనలో 100 శాతం విఫలమైందని, దాన్ని ప్రజలు ఓడించడం ఖాయమని స్పష్టం చేశారు.

అదేవిధంగా 2026లో పశ్చిమ బెంగాల్‌లోనూ ఎన్‌డీఏ సర్కారే ఏర్పడుతుందని అమిత్‌షా భరోసా వ్యక్తం చేశారు.  “తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్)లో భారీ స్కాం జరిగింది. కనీసం ఈ స్కాం విలువతో సమానమైన నిధులనైనా ఖర్చు చేసి రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 2 క్లాస్‌రూంలను నిర్మించి ఉండాల్సింది” అని అమిత్‌షా విమర్శించారు. 

డీఎంకే అవినీతిమయ పాలన వల్ల రాష్ట్రంలోని పేదలు, మహిళలు, పిల్లల జీవితాలు ప్రతికూలంగా ప్రభావితం అయ్యాయని ధ్వజమెత్తారు. స్టాలిన్ సర్కారును గద్దె దింపి తీరుతామనే ప్రతిజ్ఞను తీసుకోవాలని రాష్ట్ర బీజేపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని నెరవేర్చారో చెప్పాలని సీఎం స్టాలిన్‌ను అమిత్‌షా ప్రశ్నించారు. 

గత పదేళ్లలో తమిళనాడుకు కేంద్ర సర్కారు రూ.6.80 లక్షల కోట్లు ఇచ్చినప్పటికీ, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని సీఎం స్టాలిన్ అడుగుతుండటం విడ్డూరంగా ఉందని చెప్పారు.  బీజేపీ కార్యకర్తలు పార్టీని గెలిపించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని షా పేర్కొన్నారు. అమిత్‌ షా డీఎంకేను ఓడించలేరని ఎంకే స్టాలిన్‌ అంటున్నారని.. ఆయన చెప్పింది నిజమేనని, ఆయనను తాను ఓడించలేనని.. తమిళ ప్రజలు ఓడిస్తారని స్పష్టం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ డీఎంకే పాలనా వైఫల్యం వల్లే తమిళనాడులో శాంతిభద్రతలు గాడితప్పాయని తెలిపారు. పశ్చిమ కొంగు ప్రాంతం పరిధిలోని పలు గ్రామాల్లో వృద్ధుల టార్గెటెడ్ హత్యలను పోలీసులు ఆపలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో అన్నా డీఎంకేతో కలిసికట్టుగా ముందుకు సాగేందుకు నిబద్ధత, అంకితభావాలతో సమాయత్తం కావాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

బీజేపీ – అన్నా డీఎంకే పార్టీలది రాజకీయంగా సరైన జోడీ అని పేర్కొంటూ ఎన్‌డీఏ కూటమి నుంచి వీలైనంత ఎక్కువ మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడమే తన లక్ష్యమని నాగేంద్రన్ వెల్లడించారు. “కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భారతదేశపు ఉక్కు మనిషి. ఆయన మరో సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటివారు” అని నైనార్ నాగేంద్రన్ కొనియాడారు.

 అంతకంటే ముందు అమిత్‌షా అధ్యక్షతన బీజేపీ తమిళనాడు రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం జరిగింది. మధురైలోని ప్రఖ్యాత మీనాక్షి ఆలయంలో అమిత్‌షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమిళనాడు ప్రజలు డీఎంకే ప్రభుత్వ అవినీతితో విసిగిపోయారని.. బీజేపీ కార్యకర్తలు ప్రతి వీధి, పరిసరాలు, ఇంటింటికి చేరుకుని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే అభివృద్ధిని ప్రజలకు వివరిస్తారని ఎక్స్‌పోస్ట్‌లో పేర్కొన్నారు