
జెంటిల్‌మెన్‌కు ప్రతిరూపం హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయని ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఆయన్ని దత్తన్న అని అభిమానంగా పిలుచుకుంటారని,సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నేతగా ఆయన ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. దత్తాత్రేయ తన జీవితంలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, సంఘర్షణలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.
దత్తాత్రేయది పేరుకు హిందుత్వమే కానీ మతం మాత్రం భారతీయమని చాటిచెప్పారని చంద్రబాబు వెల్లడించారు. ‘దత్తాత్రేయ కోరుకుంది జనహితం, ఆయనది లౌకిక వాదం. ఆయన పాటించేది మత సామరస్యం. అలయ్ బలయ్ పేరుతో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చిన ఘనత దత్తాత్రేయకే దక్కింది. అందరినీ కలుపుకుని పోయే ఆయనకు విరోధులు ఎవరూ ఉండరు’ అని ప్రశంసించారు.
“దత్తాత్రేయకు ఏ రాజకీయ పార్టీ అనే వ్యత్యాసం ఉండదు. ఆయనది ఆదర్శ రాజకీయ జీవితం. ప్రజాసమస్యలపై ప్రభుత్వాలు, సీఎంలకు ఆయన లేఖలు రాశారు. లేఖలు రాయడంలో అంబాసిడర్‌గా నిలిచారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అనునిత్యం పనిచేశారు” అని చంద్రబాబు కొనియాడారు. ఉత్తర, దక్షిణ భారత ప్రజలతో ఆయన మమేకమయ్యారని చంద్రబాబు తెలిపారు.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో నీతి, నిజాయితీ… సిద్ధాంతాలు ముఖ్యమని ఉద్ఘాటించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని సూచించారు. రాజకీయ విమర్శలు సంస్కారవంతంగా ఉండాలని చెప్పారు. అసభ్యంగా మాట్లాడే వారికి ఎన్నికల్లో సరైన జవాబివ్వాలని వెంకయ్యనాయుడు తెలిపారు.
ప్రజలతో అనుబంధాన్ని ఆత్మకథ పుస్తకంలో దత్తాత్రేయ పంచుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. పదవులున్నా లేకున్నా వాజ్ పేయిూ, దత్తాత్రేయకు గౌరవం తగ్గలేదని ఆనందాన్ని వ్యక్తం చేశారు. దత్తాత్రేయ ఏ రోజు ప్రజలతో సంబంధాలు కోల్పోలేదని, ఇంతమంది గవర్నర్లను ఒకే వేదికపై చూడటం అరుదని తెలిపారు. పేదలకు కష్టాలుంటే గుర్తేచ్చే నేతలు పిజెఆర్, దత్తాత్రేయ అని పేర్కొంటూ గౌలిగూడ గల్లీ నుంచి హరియాణా గవర్నర్ గా దత్తాత్రేయ ఎదిగారని ప్రశంసించారు.
`నా స్కూల్ చదువు బీజేపీలో, కాలేజీ చదువు టీడీపీలో, ఉద్యోగం రాహుల్ గాంధీ వద్ద చేస్తున్నాను’ అని ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చెప్పానని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అజాత శత్రువు అంటూ పుస్తకాల్లో మాత్రమే చదువుకున్నామని, దత్తన్నను చూస్తే అజాత శత్రువు మన ముందే ఉన్నారని కొనియాడారు. ఆయన జీవితంలో ఎన్నో పదవులు అధిష్టించినా ఎప్పుడూ ప్రజలకు దూరం కాలేదని, రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుకులు చూసినప్పటికీ దత్తాత్రేయ ఎప్పుడూ వెనకడుగు వేయలేదని తెలిపారు.
ఎంతో మంది యువకులను గొప్ప నాయకులుగా తీర్చి దిద్దిన ఘనత బండారు దత్తాత్రేయకే దక్కుతుందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. తాను ను ఈ రోజు ఈ స్థానంలో ఉండటానికి ఆయనే కారణమని పేర్కొంటూ రాజకీయాల్లో దత్తాత్రేయ తన వేలు పట్టి నడిపించారని గుర్తు చేసుకున్నారు. దత్తాత్రేయ గారితో కలిసి ఎన్నో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని, ఆయన ప్రాతినిథ్యం వహించిన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి తాను ఎంపీగా గెలవడం చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు.
తన జీవిత కథ యువతను నిబద్ధతతో, వినయంతో ప్రజాసేవ వైపు నడిపించాలని ఆశిస్తున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. ఇది తన సామాన్య జీవితం నుండి అత్యున్నత రాజ్యాంగ పదవుల వరకు సాగిన ప్రయాణానికి హృద్యమైన కథనమని తెలిపారు. తన తల్లి దివంగత ఈశ్వరమ్మ తనకు నేర్పిన సానుభూతి, అంకితభావం, సేవా విలువలే తన జీవితాన్ని, వృత్తిని తీర్చిదిద్దాయని ఆయన గుర్తు చేసుకున్నారు.
తన జీవితం గొప్ప మలుపు తిరగడానికి కారణం ఒకే ఒక వ్యక్తి ఆయనే డాక్టర్ మనోజ్ షిండే అని చెప్పారు. ఆయన ప్రోత్సాహంతోనే ఆర్‌ఎస్‌ఎస్‌లోకి అడుగు పెట్టానని తెలిపారు. రాయిని, రప్పను శిల్పంగా మార్చినట్లు ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌లో చురుకైన కార్యకర్తగా తనను తీర్చి దిద్దారని గుర్తు చేసుకున్నారు. తన రాజకీయ జీవితం, ప్రాణం, అవయవాలు, దేహం అంతా ఆర్‌ఎస్‌ఎస్‌దేనని భావోద్వేగంతో వెల్లడించారు.
బిజెపి నేత, మాజీ గవర్నర్ స్వర్గీయ వి రామారావు, బంగారు లక్ష్మణ్‌లు తనను రాజకీయాల్లో ఎంతో ప్రోత్సహించారని చెప్పారు. సమాజం కోసం పని చేసే తత్వాన్ని ప్రతి ఒక్కరూ పెంచుకోవాలని, అప్పుడే రాజకీయాల్లో నిలబడగలుగుతామని వివరించారు. తెలంగాణ, ఏపీ, ఒడిశా, త్రిపుర గవర్నర్లు జిష్ణుదేవ్ వర్మ, జస్టిస్ అబ్దుల్ నజీర్, కంభంపాటి హరిబాబు, ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు. తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, కాంగ్రెస్ నేతలు కె.కేశవరావు, వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
More Stories
యోగా మానవతను పెంచే సామూహిక పక్రియ.. మోదీ
ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో ఏకాకిగా ఇరాన్
స్విస్ బ్యాంకుల్లో 18 శాతం తగ్గిన భారతీయుల డిపాజిట్లు