కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం లేదు

కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం లేదు

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం తనకు లేదని బీజేపీ ఎంపీ, తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన ఈటల కేసీఆర్ ను రక్షించేందుకే వాస్తవాలను దాచిపెట్టారన్న ఆరోపణలపై మాజీ మంత్రి తీవ్రంగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినపుడు ఆర్థిక మంత్రిగా ఉన్నానని, ఆ సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటిలో తన పాత్రను కమిషన్ ముందు వెల్లడించినట్లు చెప్పారు.

ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కాంగ్రెస్ నేతలు ఇలాంటి వాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ ఉప సంఘం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టే లేదని తేల్చి చెప్పారు.  కాళేశ్వరంలోని అనేక ప్రాజెక్టుల రీడిజైనింగ్ కేబినెట్ సబ్ కమిటీ సూచించిందని స్పష్టం చేస్తూ త్వరలోనే అన్ని జీవోలు, సబ్ కమిటీ నిర్ణయాలు, సూచనలు బయటపెడతా అని వెల్లడించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అంశం అసలు కేబినెట్ ముందుకే రాలేదంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఈటల రాజేందర్ కొట్టిపారేశారు.  కేబినెట్ లో చర్చించకుండా ప్రభుత్వంలో ఏదీ జరగదని గుర్తుచేశారు. అలాంటిది కాళేశ్వరం ప్రాజెక్టుపై కేబినెట్ చర్చించలేదనడం సరికాదని చెప్పారు. ప్రాజెక్టు విషయంలో తీసుకున్న ప్రతీ నిర్ణయంపై కేసీఆర్ అందరితో సంతకాలు తీసుకున్నారని స్పష్టం చేశారు. ఈ విషయం అప్పటి మంత్రులు తుమ్మల, జూపల్లి, కడియం శ్రీహరిలకు కూడా తెలుసని కూడా తెలిపారు. 

కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రాజేందర్ సవాల్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ వద్దకు తాను దోషిగా వెళ్లలేదని, సాక్షిగానే వెళ్లానని మల్కాజ్‌గిరి ఎంపి స్పష్టం చేశారు. “మా పార్టీ, కమిషన్ మీద నమ్మకం ఉన్న పార్టీ అని చెప్పి వెళ్లాను. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి అనే కోరుకునే పార్టీ మాది” అని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక తప్పులు, ఎన్నో డీవియేషన్ జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుందని పేర్కొంటూ నీకు నీతి నిజాయితీ ఉంటే కమిషన్ రిపోర్ట్‌ను బయట పెట్టాలని, మీకు చేతకాకపోతే సిబిఐకి అప్పగించండి దోషులకు శిక్ష పడేలా చేస్తామని రాజేందర్ పేర్కొన్నారు. ఇప్పుడున్న కమిషన్‌ను ఆరుసార్లు పొడిగించారని పేర్కొంటూ ఈ పరిస్థితుల్లో దోషులను బయట పెట్టకపోతే మీకు శిక్ష తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.