తెలంగాణ ఆవిర్భావోత్స‌వం.. రాష్ట్రపతి, ప్రధాని మోదీ శుభాకాంక్ష‌లు

తెలంగాణ ఆవిర్భావోత్స‌వం.. రాష్ట్రపతి, ప్రధాని మోదీ శుభాకాంక్ష‌లు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్ర‌ధాని నరేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆవిష్క‌ర‌ణ‌లు, అభివృద్ధి రంగంలో తెలంగాణ దూసుకెళ్తోంద‌ని రాష్ట్రపతి పేర్కొన్నారు. తెలంగాణ‌కు ఘ‌న‌మైన సాంస్కృతిక వార‌స‌త్వం ఉంద‌ని, అక్క‌డ ప్ర‌జ‌లు చాలా క‌ష్ట‌జీవులు అని ఆమె కొనియాడారు.  తెలంగాణ ప్ర‌జ‌లు నిరంత‌రం ప్ర‌గ‌తి సాధించాల‌ని, ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు.
ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వంతోనూ, సజీవ సంప్రదాయాలతోనూ ఆశీర్వదించబడిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల సృజనాత్మకత, ఆవిష్కరణలు, కఠోర శ్రమ, దృఢసంకల్పం ద్వారా దేశ ప్రగతికి తెలంగాణ గణనీయమైన తోడ్పాటును అందించిందని ఆయన ప్రశంసించారు. 
 
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి స‌హ‌క‌రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని, అభివృద్ధి చెందిన భార‌త్ క‌ల సాకారం చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌ధాని మోదీ చెప్పారు. తెలంగాణ ప్రజలు తమ సృజనాత్మకతకు, వ్యాపార దృక్పథానికి ప్రసిద్ధులు అని చెబుతూ ఈ రాష్ట్రం ధైర్యానికి, సంకల్పానికి,పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన గొప్ప చరిత్ర, వైభవోపేతమైన సంస్కృతిని కలిగి ఉందని ప్రధాని కొనియాడారు.  వికసిత భారత్‌ అనే మన స్వప్నాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ అభివృద్ధి ప్రస్థానానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించడానికి కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. 
 

కాగా, లోక్‌భవన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల త్యాగాలు, దశాబ్దాల ప్రజాస్వామ్య పోరాటాలకు ప్రతీక తెలంగాణ ఆవిర్భావమని ఆయన గుర్తు చేశారు. ఆధునిక తెలంగాణ నిర్మాణానికి పునాదులు వేసిన ప్రతి ఒక్కరినీ స్మరించుకోవాలని, శతాబ్దాల సంస్కృతి, సంప్రదాయాలు, గ్రామీణ వ్యవసాయ వారసత్వం తెలంగాణ అసలైన జీవనాడిగా నిలిచాయని పేర్కొన్నారు. 

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ కోటి రత్నాలవీణ అని చెప్పారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అన్న కాళోజీ మాటలను గుర్తు చేశారు. సంక్షేమం, అభివృద్ధికి ఈ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ రాచరికాన్ని, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదని స్పష్టం చేశారు. 
 
తమది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రజా ప్రభుత్వమన్న సీఎం, గత 30 నెలల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విజయవంతం అయ్యామని తెలిపారు. తెలంగాణ విజన్‌-2047 లక్ష్యం సాధించే దిశగా వెళ్తున్నామని స్పష్టం చేశారు. రైతులను వ్యవసాయ పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.