భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని పికెఓసి (ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్) డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఈ డిప్ సైడ్ బ్లాక్ వల్ల సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షిప్తాలు ఉన్నాయని, తద్వారా ప్రతి ఏటా 6 మిలియన్ టన్నుల చొప్పున 25 ఏళ్ల పాటు ఈ మైన్ పొందవచ్చని ఆయన చెప్పారు.
దీంతో దాదాపు 2 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆయన ఢిల్లీలో సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇటీవలే ఒడిశాలోని నైని కోల్ బ్లాక్, తాడిచర్ల -2 బ్లాక్ సింగరేణి సిగలో చేరిన సందర్భంలో పికెఓసి డిప్ సైడ్ బ్లాక్‌ను కూడా సింగరేణికే దక్కేలా చొరవ తీసుకోవాలని కార్మికులు, యూనియన్ లీడర్ల నుంచి డిమాండ్లు వచ్చాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో సోమవారం వేలం ప్రక్రియ పూర్తయైందని, ఈ విధానంలో సింగరేణి సంస్థకు మణుగూరు పికెఓసి-2 డిప్‌సైడ్ బ్లాక్‌ను కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థ అయిన సింగరేణి సంస ఇక్కడ దొరికే జి-8 (మంచి క్వాలిటీ) బొగ్గు కారణంగా మొత్తం రూ. 43 వేల కోట్లకు పైగా రెవెన్యూ జనరేట్ అవుతుందని ఆయన తెలిపారు.
అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10,500 కోట్లకు మించి ఆదాయం కూడా లభిస్తుందని పేర్కొంటూ దీని వల్ల తెలంగాణ ఇంధన భద్రతకు భరోసా దక్కడంతో పాటుగా సింగరేణి భవిష్యత్ అభివృద్ధికి అవసరమైన వనరులు లభిస్తాయని ఆయన తెలిపారు. సింగరేణి బొగ్గు కంపెనీకి వరుసగా 3 బొగ్గు బావులు దక్కడం ద్వారా దక్షిణ భారతదేశానికి అవసరమైనంత మేర బొగ్గును అందుబాటులోకి తెచ్చి రాష్ట్ర ప్రాంతంలో మరింత పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పనకు మేలు జరుగుతుందని ఆయన వివరించారు.
నైని, తాడిచర్ల-2, పికెఓసి-2 డిప్‌సైడ్ బ్లాక్ రావడంతో సింగరేణికి 860 మిలియన్ టన్నుల రిజర్వ్ సమకూరుతాయని ఆయన తెలిపారు. ఇంకా 6,500 మందికి జీవనోపాధి లభిస్తుందని ఆయన వివరించారు. సగటున 35 ఏళ్లపాటు ఏడాదికి 22 మిలియన్ టన్నుల చొప్పున ఉత్పత్తి చేయవచ్చని చెప్పారు. ఈ 3 బ్లాక్స్ వల్ల సింగరేణికి రూ.1,95,510 కోట్లకు పైగా రెవెన్యూ వస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా రూ.48 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.

More Stories
ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలు.. మాతంగి స్వర్ణలత
20 శాతం భర్తీకాని ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో సీట్లు
సొంత లాంచ్ ప్యాడ్ నిర్మించనున్న స్కైరూట్