మణిపూర్ లో ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ, ఇంటర్నెట్‌ నిలిపివేత

మణిపూర్ లో ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ, ఇంటర్నెట్‌ నిలిపివేత
మణిపూర్‌లో మైతీ – కుకీ తెగల మధ్య జరుగుతున్న ఘర్షణలతో ప్రమేయం ఉన్నదన్న ఆరోపణలపై మైతీ తెగకు చెందిన స్వచ్ఛంద సంస్థ అరంబై తెంగల్‌ (ఎటి) నేత కనన్‌ సింగ్‌ను పోలీసులు శనివారం ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్‌ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయనతోపాటు మరో నలుగురిని విచారణ కోసం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

ఎటి కార్యకర్తలు భద్రతా దళాలతో ఘర్షణకు దిగారు. విమానాశ్రయ రహదారిపై భద్రతా దళాలు ప్రయాణించే బస్సును తగలబెట్టారు. భద్రతా సిబ్బందిసహా పలువురు ఈ ఘర్షణల్లో గాయపడ్డారు. తమ నేతను విడిచిపెట్టకపోతే ఆత్మాహుతి చేసుకుంటామంటూ కొందరు యువకులు రాజధాని ఇంఫాల్‌లో పెట్రోల్‌ పోసుకుని ఆందోళన చేశారు.  శనివారం రాత్రి రోడ్లపై టైర్లకు నిప్పు పెట్టి ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. కాల్పుల శబ్దాలు కూడా వినిపించాయని ఇంఫాల్‌ వాసులు తెలిపారు.

“మేము ఆయుధాలను విడిచి పెట్టాము. వరదల సమయంలో మీరు చేయాల్సిన పనుల్ని మేమే చేశాం. ఇప్పుడు మీరు మమ్మల్ని అరెస్ట్‌ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఆత్మాహుతి చేసుకుంటాం” అంటూ కొందరు యువకులు కేకలు వేశారు.  అరెస్టులను నిరసిస్తూ ఇంఫాల్‌ వ్యాలీలోని ఇంఫాల్‌ తూర్పు, పశ్చిమ, బిష్ణుపూర్‌, కాక్సింగ్‌, థౌబల్‌ జిల్లాల్లో పది రోజులపాటు షట్‌ డౌన్‌ విధిస్తామంటూ అరంబై తెంగల్‌ తెలిపింది. ఈ ఐదు జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించడంతోపాటు ఇంటర్నెట్‌పై నిషేధం విధించింది. దీంతో ఆదివారం రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి.

పోలీసులు అరెస్టు చేసిన కనన్‌సింగ్‌ మాజీ హెడ్‌ కానిస్టేబుల్‌. అరంబై తెంగల్‌ సభ్యుడైన కరన్‌సింగ్‌ను అరెస్టు చేసినట్లు సిబిఐ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. 2023లో వివిధ క్రిమినల్‌ కార్యకలాపాల్లో కనన్‌సింగ్‌ పాల్గొన్నాడని, అరెస్టు చేస్తున్న విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలియజేశామని పేర్కొంది.  సుప్రీంకోర్టు సూచనల మేరకు మణిపూర్‌లో హింసకు సంబంధించిన కేసులను పరిశీలిస్తున్నామని పేర్కొంది. ఇక్కడి కేసుల విచారణ గౌహతికి మారిందని, కనన్‌సింగ్‌ను ఇంఫాల్‌ నుంచి గౌహతి తరలించామని, విచారణ కొనసాగుతుందని తెలిపింది.

కాగా, వివిధ పార్టీల ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం గవర్నర్‌ అజరుకుమార్‌ భల్లాను రాజ్‌భవన్‌లో కలిసిందని, ఆందోళనలను అదుపు చేసి, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు అవసరమైన అన్ని చర్యలు గవర్నర్‌ తీసుకుంటారని గవర్నర్‌ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అదనపు ఎస్పీ అమిత్‌ ఇంటిపై జరిగిన దాడిలోనూ, 2024 ఫిబ్రవరిలో ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి కిడ్నాపింగ్‌లోనూ కరణ్‌ సింగ్‌ అనుమానితుడు. అదే నెలలో ఆయన ఓ కమాండో యూనిట్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేశారు. విధినిర్వహణల్లోక్ష్యం వహించాడన్న కారణంతో ఆయనను సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత కరణ్‌ సింగ్‌ ఎటిలో చేరారు.

మరోవంక, తెంగ్నౌపాల్‌ జిల్లా మోరేహ్ లో ఇండియన్‌ రిజర్వ్‌ బెటాలియన్‌ పోస్ట్‌, భద్రతా దళాలపై దాడి కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఎ తెలిపింది. 2024 జనవరి 17న జరిగిన దాడిలో ఇద్దరు పోలీసు కమాండోలు మరణించగా, అనేకమంది గాయాల పాలయ్యారు. అరెస్టయిన వారిలో తాంగ్‌మిన్లెన్‌ మేట్‌, కామ్గిన్‌ తాంగే గంగ్లే, హెంటిన్‌ తాంగ్‌ కిప్‌ గెన్‌ ఉన్నారు.

మణిపూర్‌లో శాంతిభద్రతలను కాపాడటంలో బిజెపి నేతృత్వంలోని డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ విఫలం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న రాష్ట్రపతి పాలన విధించారు. మే 20న భద్రతా సిబ్బంది తమ వాహనంపై మణిపూర్‌ పేరు తొలగించడంలో నిరసనలు చెలరేగాయి. ఆ తర్వాత తాజాగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2023లో మణిపూర్‌లో అల్లర్లు ప్రారంభమైన తరువాత 250 మందికిపైగా మరణించగా, 60 వేల మంది వరకూ నిర్వాసితులయ్యారు. అనేకమంది ఇప్పటికీ సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.