పోలీసుల హెచ్చరికను తోసిపుచ్చిన ప్రభుత్వం !

పోలీసుల హెచ్చరికను తోసిపుచ్చిన ప్రభుత్వం !
 
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సిబి) విజయ వేడుకల్లో జరిగిన పొరపాట్లపై పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నిందారోపణలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విధాన సౌధ డిసిపి విడుదల చేసిన లేఖతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. విధాన సౌధ ఆవరణలో అధికంగా జనం గుమిగూడతారని, సమయం లేకపోవడం, భద్రతా సిబ్బంది కొరత వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి పోలీసులు తీసుకెళ్లినట్లు లేఖలో స్పష్టమైంది. 
 
విధాన సౌధ వేడుకలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నది నిజమే అయినప్పటికీ రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన విధాన సౌధలో బహిరంగ కార్యక్రమం నిర్వహించడం, జూన్‌ 4 ఉదయం విక్టరీ పరేడ్‌ ఉంటుందని ఏకపక్షంగా ప్రకటించడంతో లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారని, చివరికి అది చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటకు దారితీసిందని పోలీసుల వాదన. 
 
ఆర్‌సిబి జట్టు ఐపిఎల్‌ ఫైనల్స్‌లో గెలిస్తే వారికి సన్మానం చేయడంపై అభిప్రాయాన్ని కోరుతూ జూన్‌ 3న విధాన సౌధ డిసిపికి పరిపాలనా సంస్కరణలశాఖ (డిపిఎఆర్‌) లేఖ రాసింది. జూన్‌ 4న ఈ లేఖపై విధాన సౌధ డిసిపి ఎంఎన్‌ కరిబసవగౌడ స్పందించారు. 
 
ఈ కార్యక్రమానికి లక్షలాది మంది ఆర్‌సిబి అభిమానులు గుమిగూడుతారని, విధాన సౌధ డివిజన్‌లో భద్రతా సిబ్బంది కొరత ఉన్నందున బందోబస్తు చేయడం సమస్యగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బయట నుండి ఎక్కువ మంది సిబ్బందిని మోహరించడం, శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ పోలీసులతో సమన్వయపరచడానికి సమయం లేదని తెలిపారు.  విధాన సౌధలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎక్కువ సమయం అవసరమని స్పష్టం చేశారు. సన్నాహాలు చేయడానికి తగినంత సమయం లేదని చెబుతూ, వేడుకలను ఆదివారంకి వాయిదా వేయాలనే సూచనను తోసిపుచ్చారని సమాచారం.
కాగా, ఆర్సీబీ క్రికెట్‌ జట్టుకు సన్మానం జరిగిన విధాన సౌధ వద్ద తొక్కిసలాట జరగలేదని, చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఆ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాము ఎటువంటి తప్పు చేయనపుడు ఇబ్బంది పడే ప్రశ్నే రాదని ఆయన చెప్పారు. అటువంటి సంఘటన జరగకూడదనే తాము అంటున్నామని, అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల ఆ సంఘటన జరిగిందని ఆయన ఆరోపించారు. 
“నేను బాధ పడుతున్నాను. యావత్‌ ప్రభుత్వం బాధ పడుతోంది. తొక్కిసలాటలోమొదటి మరణం సాయంత్రం 3.50 గంటలకు జరిగింది. కాని సాయంత్రం 5.45 గంటలకు నాకు సమాచారం అందింది” అని సిద్ధరామయ్య వెల్లడించారు. చిన్నస్వామి స్టేడియం సమీపంలో భద్రతా ఏర్పాట్ల గురించి నగర పోలీసు కమిషనర్‌ తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొంటూ ఈ కారణంగానే సీనియర్‌ పోలీసు అధికారులపై చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు.