
కేరళ రాజధాని తిరువనంతపురంలోని ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయంలో 270 సంవత్సరాల తర్వాత అరుదైన మహా కుంభాభిషేకం నిర్వహించారు. పురాతన ఆలయంలో చాలా కాలంగా కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు ఇటీవల పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రత్యేకమైన పవిత్రోత్సవం జరిగింది. గర్భగుడి పైన ఉన్న మూడు గోపురాలు, విశ్వక్‌సేన విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించడం, తిరువంబడి కృష్ణ ఆలయంలో ‘అష్టబంధ కలశం’ ఏర్పాటు వంటి పూజా కార్యక్రమాలను ఆలయ పూజారులు నిర్వహించారు.
ట్రావెన్‌కోర్ రాజకుటుంబం ప్రస్తుత అధిపతి మూలం తిరునాల్ రామ వర్మ, ఆ రాజ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ క్రతువులు జరిగాయి. కాగా, పునరుద్ధరించిన ఆలయంలో ఆధ్యాత్మిక శక్తి బలోపేతం, ఆలయం పవిత్రతను తిరిగి పొందడం మహా కుంభాభిషేకం ప్రధాన ఉద్దేశమని ఆలయ అధికారులు తెలిపారు. మహా కుంభాభిషేకానికి వారం ముందు నుంచి ఆచార్య వరణం, ప్రసాద శుద్ధి, ధార, కలశం వంటి ఇతర ఆచారాలు నిర్వహించినట్లు చెప్పారు.
మరోవైపు కేరళ గవర్నర్ విశ్వనాథ్ రాజేంద్ర అర్లేకర్ పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించి ఈ అరుదైన ఆచారాన్ని వీక్షించారు. 270 ఏళ్ల తర్వాత నిర్వహించిన అరుదైన మహా కుంభాభిషేకాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాలుగు ప్రవేశ ద్వారాల వద్ద భారీ స్క్రీన్లపై పూజా క్రతువులను ప్రదర్శించారు.
More Stories
2024లో తీవ్ర స్థాయికి బాలలపై హింస
కోయంబత్తూర్ కారు బాంబు కేసులో మరో నలుగురు అరెస్ట్
వీసాల అనిశ్చితతో అమెరికాలో చదువులపై వెనకడుగు!