అయోధ్య రామమందిరానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగినప్పటి నుంచి సుమారు 15 కోట్లకు పైగా ప్రజలు ఆలయాన్ని సందర్శించినట్లు ట్రస్ట్ వెల్లడించింది. ట్రస్ట్‌కు మొత్తం రూ. 500 కోట్లకు పైగా విరాళాలు అందాయి. ఇందులో సుమారు రూ. 150 కోట్లు విరాళాల హుండీల ద్వారా రాగా మిగిలిన రూ. 350 కోట్లు ఆన్లైన్ మాధ్యమాలు, కౌంటర్ల ద్వారా సమకూరాయి.
ఈ నిధులను ఆలయ నిర్వహణ, సేవా కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రాజెక్టుల కోసం వినియోగిస్తామని ట్రస్ట్ పేర్కొంది. గణాంకాల ప్రకారం ఒక్కో భక్తుడి నుంచి సగటున రూ.33 కంటే ఎక్కువ విరాళం లభిస్తోందని వివరించింది. రామమందిరంలో విరాళాల ప్రక్రియను సులభతరం చేయడానికి ఆరు పెద్ద హుండీలను ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ అధికారులు తెలిపారు.
వీటికి అదనంగా మందిర ప్రాంగణంలోని ఇతర ఆలయాల వద్ద మరో 12 విరాళాల హుండీలను ఉంచినట్లు చెప్పారు. భక్తులు తమ ఇష్టానుసారం నగదు రూపంలో విరాళాలు ఇచ్చి, వెంటనే కంప్యూటరైజ్డ్ రసీదును పొందేందుకు వీలుగా నాలుగు కౌంటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ విధానం భక్తులు సులభంగా విరాళాలు ఇవ్వడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
రామమందిరానికి ప్రస్తుతం రోజుకు సగటున రూ.8 నుంచి రూ. 10 లక్షల వరకు విరాళాలు అందుతున్నాయి. పారదర్శకత కోసం విరాళాల ప్రక్రియ అంతా సీసీటీవీ నిఘాలోనే జరుగుతుంది. డబ్బును లెక్కించే ప్రదేశంలో వాయిస్ రికార్డింగ్ సదుపాయంతో కూడిన ఆధునిక సీసీటీవీ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. డబ్బును లెక్కించడానికి ఒక ప్రత్యేక ఏజెన్సీని నియమించారు. ఆరుగురు సిబ్బంది రెండు షిఫ్టుల్లో ఈ లెక్కింపు ప్రక్రియను నిర్వహిస్తారు.
వీరికి అదనంగా ట్రస్ట్ నియమించిన అధికారులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు కూడా ఈ ప్రక్రియలో సహాయపడతారు. భక్తులు అందించిన విరాళాలను లెక్కించిన తర్వాత ఆ నిధులను ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ ఖాతాలో జమ చేస్తారు. నిర్ణీత పరిమితులకు అనుగుణంగా డబ్బును బ్యాంక్ ఖాతాలో జమ చేసి మిగిలిన నిధులను ఒక సంచిలో సీల్ చేసి సురక్షితమైన గదిలో భద్రపరుస్తారు.
ఆన్లైన్ మాధ్యమాలు, చెక్కులు, యుపిఐ లేదా విరాళాల పెట్టెల ద్వారా ట్రస్ట్‌కు అందిన నిధులపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్ నిర్వహిస్తారు. ఇందుకోసం చార్టర్డ్ అకౌంటెంట్లను నియమించారు.ఈ ప్రక్రియలో అంతర్గత బ్యాంక్ సిబ్బంది, అధికారులు కూడా పాల్గొంటారు. ఈ ఆర్థిక వివరాలు ట్రస్ట్‌కు సమర్పించిన తర్వాత సమావేశాల సమయంలో దాని నిర్వాహక సభ్యులు పరిశీలిస్తారు.

More Stories
యూపీలో కరుడుగట్టిన క్రిమినల్ బబ్లూ హతం
భారత్‌లో పెరుగుతున్న వృద్ధుల జనాభా
బెంగాల్ లో రాష్ట్ర వ్యాప్తంగా మదర్సాలపై సమీక్ష