పిఓకెలో నిరసనకారులపై హింసాకాండకు పాక్ జవాబుదారీ!

పిఓకెలో నిరసనకారులపై హింసాకాండకు పాక్ జవాబుదారీ!
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో నిరసనకారులపై జరిగిన హింసాకాండపై వచ్చిన వార్తల నేపథ్యంలో, భారత్ మంగళవారం పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శించింది. మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇస్లామాబాద్ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ, ఈ విషయంలో దానిని జవాబుదారీగా నిలపాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. 
 
ఒక మీడియా సమావేశంలో ప్రశ్నలకు సమాధానమిస్తూ, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, పాకిస్థాన్ తన అంతర్గత వైఫల్యాలను దాచిపెట్టేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. “ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి వస్తున్న నకిలీ వార్తలు, వీడియోల సరళిని మేము గమనిస్తూనే ఉన్నాము. ఇది పాకిస్థాన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ఒక నిస్సహాయ ప్రయత్నం,” అని జైస్వాల్ ధ్వజమెత్తారు. 
 
హింసాకాండను ప్రస్తావిస్తూ, ఆ ప్రాంతంలో నిరసనకారుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆందోళనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. “పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో పోలీసులు తీవ్రంగా హింసించారని, ఈ ఘటనల్లో పలువురు నిరసనకారులు మరణించారని, చాలా మంది గాయపడ్డారని నివేదికలు వస్తున్నాయి. పాకిస్తాన్ చేసిన దుశ్చర్యలకు, దురాగతాలకు అంతర్జాతీయ సమాజం దానిని జవాబుదారీగా నిలబెడుతుందని మేము ఆశిస్తున్నాము,” అని ఆయన తెలిపారు. 
 
నిరసనకారులు, అధికారుల మధ్య ఘర్షణల సందర్భంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కొనసాగుతున్న అశాంతి, హింసపై పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సిపి) ఆందోళన వ్యక్తం చేసిన ఒక రోజు తర్వాత భారతదేశం ఈ విధంగా స్పందించింది. ఈ పరిస్థితి పట్ల తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని, ఉగ్రవాద నిరోధక చట్టాల కింద జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసి)ని నిషేధించాలన్న ప్రాంతీయ పరిపాలన నిర్ణయంపై కూడా తాము అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నామని ఆ హక్కుల సంస్థ తెలిపింది. 
 
పాక్ ఆక్రమిత కాశ్మీర్ శాసనసభ అని పిలవబడే దానిలోని 12 శరణార్థుల సీట్లను రద్దు చేయాలని జేఏఏసి డిమాండ్ చేస్తోంది. 1947 తర్వాత జమ్మూ కాశ్మీర్ నుండి పాకిస్థాన్‌కు వలస వెళ్లిన ప్రజల కోసం ఈ సీట్లు రిజర్వ్ చేశారు. ముజఫరాబాద్‌లో ప్రభుత్వ ఏర్పాటును ప్రభావితం చేయడానికి పాకిస్థాన్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ సీట్లను తరచుగా ఉపయోగించుకుంటున్నాయని ఆ సంస్థ ఆరోపిస్తోంది.
 
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియలను న్యూఢిల్లీ కూడా నిరసించింది. ఇటీవలి నిరసనల సమయంలో మరణాలు, గాయాలైనట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో, ఆ ప్రాంతంలోని రాజకీయ, మానవ హక్కుల పరిస్థితిపై మళ్లీ విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ తాజా వాగ్వాదం చోటుచేసుకుంది.