నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం, ముంబై లోని ముఖ్యమంత్రి కార్యాలయం, పూణేలోని మేయర్ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని మహారాష్ట్ర మున్సిపల్ అధికారులకు రెండు రోజుల క్రితం బాంబు బెదిరింపు ఈమెయిళ్ళు అందాయి. దాంతో కొన్ని చోట్ల ప్రజలను ఖాళీ చేయించడం, భద్రతా తనిఖీలు నిర్వహించడం జరిగిందని అధికారులు తెలిపారు.
రేషింబాగ్‌లోని మహల్ ప్రాంతంలో ఉన్న డాక్టర్ హెడ్గేవార్ స్మృతి భవన్‌లో గల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయంలో పేలుడు పరికరాన్ని అమర్చినట్లు నాగ్‌పూర్ మేయర్ నీతా థాక్రేకు ఒక ఈమెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ బెదిరింపు తర్వాత, క్షుణ్ణంగా గాలించడం కోసం బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ బృందాన్ని వెంటనే సంఘటనా స్థలానికి పంపినట్లు అధికారులు తెలిపారు.
అయితే, అనుమానాస్పదంగా ఏమీ లభించలేదని వారు పేర్కొన్నారు. ముందుజాగ్రత్త చర్యగా భద్రతా తనిఖీలను ముమ్మరం చేశారు. అన్ని కీలక ప్రాంతాలను తనిఖీ చేస్తున్నారు. రాష్ట్ర రాజధానిలోని మేయర్ కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయంతో సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరుగుతాయని హెచ్చరిస్తూ బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు ఈమెయిళ్ళు అందినట్లు అధికారులు తెలిపారు.
మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన అనేక అధికారిక ఈమెయిల్ ఐడీలకు పంపిన ఈమెయిళ్ల కారణంగా భద్రతా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయని వారు తెలిపారు. అధికారుల ప్రకారం, మేయర్ కార్యాలయం, సీఎంవో, బీఎస్ఈ భవనం మరియు మున్సిపల్ కార్యాలయాలలో బాంబు పేలుళ్లు జరుగుతాయని ఆ ఈమెయిళ్లు హెచ్చరించాయి. ఇదే విధమైన కంటెంట్‌తో ఉన్న ఈ ఈమెయిళ్లలో, మధ్యాహ్నం 1.11 గంటలకు ముంబై మేయర్ కార్యాలయంలో పేలుడు జరిపేందుకు, పేలుడు పదార్థాలతో నింపిన కారును ఉపయోగిస్తామని పేర్కొన్నారు.
అలాగే, నిర్దిష్ట సమయాల్లో బీఎస్ఈ భవనం, సీఎంవో, బీఎంసీ కార్యాలయాలపై బాంబు బెదిరింపులు కూడా ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. పుణెలో, మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం, మేయర్ కార్యాలయానికి కూడా బాంబు పేలుడు బెదిరింపుతో కూడిన ఈమెయిల్ అందింది. ప్రధాన పరిపాలనా భవనం మొత్తాన్ని ఖాళీ చేయించి, బాంబు డిటెక్షన్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారని ఒక మున్సిపల్ అధికారి తెలిపారు.
ఖలిస్తాన్ నేషనల్ ఆర్మీగా తమను తాము అభివర్ణించుకుంటున్న ఒక బృందం పంపినట్లుగా భావిస్తున్న ఈమెయిల్‌లో 1984 నాటి ఆపరేషన్ బ్లూస్టార్, ఆపరేషన్ వుడ్‌రోజ్‌లకు ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఇచ్చిందని ఆ ఇమెయిల్‌లో పేర్కొన్నారని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల ‘అంతం’తో పాటు ‘బద్లా’ (ప్రతీకారం)కు పిలుపునిచ్చారని వారు తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు పీఎంసీ ప్రాంగణంలోకి ప్రవేశాన్ని నిషేధించినట్లు అధికారులు తెలిపారు.

More Stories
కర్ణాటక ఆలయాల్లోని విరాళాల పెట్టెలపై సీసీటీవీ నిఘా
గురుగ్రామ్ ఎన్కౌంటర్లో 60 రౌండ్ల ఫైరింగ్.. నలుగురు గ్యాంగ్స్టర్లు మృతి
షుగర్ బాధితులకు వారానికి ఒక్క ఇంజెక్షన్ చాలు!