
ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి
ఉపాధ్యక్షుడు, ఏపీ బీజేపీ
“భారతీయతను నిర్లక్ష్యం చేస్తే స్వాతంత్ర్యానికి అర్థం ఉండదు. ప్రజల సమగ్ర పురోగతిని సాధించాలనే ఉద్దేశ్యంతో శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ అవసరాలను తీర్చడం అనే నాలుగు విధాలైన బాధ్యతల ఆదర్శం మన లక్ష్యం” – పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ
ప్రపంచంలో మనుషులందరూ సమానమే. అందరూ ఇదే చెబుతారు. కానీ ఆచరణకు వచ్చే సరికి ప్రజల మధ్య విభజన పెడతారు. కేపిటలిజం, కమ్యూనిజం లాంటి వాదనలతో పరస్పర దోపిడీని ప్రోత్సహిస్తారు. కానీ విశ్వమానవ స్ఫూర్తితో ప్రజలంతా ఒక్కటే అన్న భావనతో ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగి ఉన్న ఒకే ఒక్క వాదం “ ఏకాత్మతా మానవతావాదం”. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఈ “ ఏకాత్మతా మానవతావాదం” ఇప్పుడు మన దేశ రాతను మారుస్తోంది. ఈ రోజున భారత దేశాన్ని అభివృద్ధి పథంలో పయనించేలా చేస్తోంది. భారత ప్రజల మధ్య ఆర్థిక, సామాజిక అంతరాలు తగ్గేలా చేస్తోంది. ప్రజలంతా సమానమే అన్న భావన పెరిగేలా చేస్తోంది.
`పెట్టుబడి పెట్టు …ప్రజల్ని బానిసలుగా చేసుకుని డబ్బు సంపాదించు’ అనేది క్యాపిటలిజం. `ఉన్నవాడిని కొట్టు .. లేని వాడికి పెట్టు’ అనేది కమ్యూనిజం. ఈ రెండు వాదాల్లోనూ సగం మంది మనుషుల్ని మరో సగం మంది మనుషులు దోచుకోవాలన్న సందేశం ఇమిడి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఓకే నాణేనికి రెండు కోణాలు ఈ రెండు సిద్ధాంతాలు. కానీ “ప్రతి మనిషి జీవితంలో అభివృద్ధి చెంది, ఆధ్యాత్మికతో మానవసేవ చేయడం” అనే భావనతో వచ్చినదే ఏకాత్మతా మానవతావాదం.
క్యాపిటలిజం, కమ్యూనిజం వైఫల్యాల వల్ల ప్రపంచంలో విభజన వచ్చింది. ధనిక, పేద అంతరాలు పెరిగిపోయాయి. ఒకరి అభివృద్ధికి, మరొకరు సహకరించుకుని సమాజంలో సమానత తేవాల్సిన లక్ష్యం లేకుండా ఒకరినొకరు దోచుకోవడం అన్న వాదంతో విభజన తెచ్చాయి. కానీ అందరూ అభివృద్ధి..అందరూ ఆధ్యాత్మిక దృష్టితో మానవసేవ చేయాలి అన్న ఆలోచనతో పుట్టిందే “ ఏకాత్మతా మానవతావాదం”.
“ ఏకాత్మతా మానవతావాదం” సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. పదవులేమీ అధిరోహించకుండానే రాజకీయాల్లో దిగ్గజంగా ఎదిగిన నేత. ఆయన భావజాలం, ప్రతిపాదించిన సిద్ధాంతమే ఆయనను ఉన్నత స్థానంలో నిలబెట్టింది. పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ తత్వవేత్త, రచయిత, పాత్రికేయుడు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్త. భారతీయ జనసంఘ్ (బిజెఎస్), ఇప్పటి భారతీయ జనతా పార్టీ వారి ఆలోచన భావజాలంతో ప్రారభమైన సంస్థ.
భారతీయ సంస్కృతి, గాంధీ సిద్ధాంతాలైన సర్వోదయ, స్వదేశీ, హిందుత్వ భావజాలాన్ని సమన్వయం చేసుకుని సామాజిక సమానత్వాన్ని సమర్థించారు. రాజకీయాలను ప్రజా సేవగా భావించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఆయన ఆలోచనలను “మేక్ ఇన్ ఇండియా”, “వోకల్ ఫర్ లోకల్” వంటి కార్యక్రమాలలో ప్రతిబింబిస్తోంది.
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఎన్నో కష్టాలు ఎదుర్కొని తన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లారు. 8 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు మరణించారు. తమ్ముడు శివదయాళ్ కూడా చిన్న వయసులోనే చనిపోయారు. సీకర్‌లోని హైస్కూల్‌లో చదివారు. అక్కడ మహారాజా ఆఫ్ సీకర్ నుండి బంగారు పతకం, స్కాలర్‌షిప్ పొందారు. ప్రస్తుతం బిర్లా స్కూల్ గా మారిన పిలానీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. కాన్పూర్‌లోని సనాతన ధర్మ కాలేజీలో బీఏ పట్టా పొందారు .
1937లో కాన్పూర్‌లో చదువుతున్నప్పుడు సహపాఠి బాలుజీ మహాశబ్దే ద్వారా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో చేరారు. 1940లలో లక్నో నుండి “రాష్ట్ర ధర్మ” అనే మాసపత్రికను ప్రారంభించారు. ఇది హిందుత్వ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగపడింది. “పాంచజన్య” వారపత్రిక, “స్వదేశ్” దినపత్రికల్ని ప్రారభించారు. 1942లో పూర్తి సమయం ప్రచారక్‌గా మారారు. 1951లో శ్యామా ప్రసాద్ ముఖర్జీతో కలిసి భారతీయ జనసంఘ్ స్థాపించారు. 1967 డిసెంబర్ 29న జనసంఘ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
విశ్వ మానవ స్ఫూర్తితో “ఏకాత్మ మానవతావాదం” సిద్ధాంతాలను అనుసరిస్తున్నారు. ఈ రోజు దేశంలో అసమానతలు తగ్గుతున్నాయి. పేదరికం తగ్గుతోంది. ప్రజలందరూ అభివృద్ధి చెందాలి.. వారికి ఆధ్యాత్మికంగా స్పష్టమైన అభిప్రాయాలు ఉండాలి. అప్పుడే క్రమబద్ధమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. విలువలతో కూడిన జీవనం అందుబాటులోకి వస్తుంది. ప్రజలందరూ విలువలతో కూడిన అభివృద్ధిని చూస్తే దేశం ఎంతో ముందడుగు వేస్తుంది.
నీతి ఆయోగ్ ప్రకారం 2013-14లో 29.17% నుండి 2022-23లో 11.28% కు, అంటే 17.89 శాతం పాయింట్ల తగ్గుదల. 9 సంవత్సరాలలో 24.82 కోట్ల మంది మల్టీ డైమెన్షనల్ పేదరికం నుండి బయటపడ్డారు. అంటే వీరందరికీ ఉపాధి కలుగుతోంది. ఇదంతా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ “ ఏకాత్మతా మానవతావాదం” సిద్ధాంతాల సమర్థ అమలుతోనే సాధ్యమయిందని భావింవచ్చు.
దేశంలో ఉన్న అనేక సమస్యలకు కారణం కేపిటలిజం, కమ్యూనిజమే. ఈ రెండు సిద్ధాంతాలు.. అందరూ అభివృద్ధి చెందాలి, విలువలతో బతికాలి అని చెప్పలేదు. కానీ “ ఏకాత్మతా మానవతావాదం” సిద్ధాంతం మాత్రం విశ్వమానవడి కోసం ప్రతిపాదించింది. ఆర్థిక అసమానతలు తగ్గితే అందరూ సమానం అవుతారు. అప్పుడు కుల వివక్ష కూడా తగ్గిపోతుంది.
ఏ మతమైన అందరికీ మేలు చేయాలని చెప్పేదే “ ఏకాత్మతా మానవతావాదం” సిద్ధాంతం. ఈ సిద్దాంతంపై ప్రపంచంలోని అనేక దేశాలు పరిశోధనలు చేశాయి. తమ దేశ కాల, మాన పరిస్థితులకు అనుగుణంగా ఉన్న లక్ష్యాలను అమలు చేసుకునేందుకు ప్రయత్నించాయి. పూర్తిగా విశ్వమానవ శ్రేయస్సుకు ఉపయోగపడే సిద్ధాంతాలు కావడంతో అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా “ఏకాత్మతా మానవతావాదం”పై పరిశోధనలు చేశాయి. కొన్ని వందల మంది విద్యార్థులు ఈ అంశంపై పీహెచ్‌డీలు కూడా చేశారు. ప్రజలకు ఈ సిద్దాంతాలు ఎంత అవసరరమో వీరి పరిశోధనల్లో తేలింది.
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ” ఏకాత్మతా మానవతావాదం” భావజాలానికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, 2025 మే 31 నుండి జూన్ 1 వరకు న్యూఢిల్లీలో రాష్ట్రీయ స్మృతి సమ్మేళన్ పేరుతో జాతీయ సమావేశం నిర్వహించారు. ఈ సదస్సును డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎస్ పి ఎం ఆర్ ఎఫ్) ఆధ్వర్యంలో, పబ్లిక్ పాలసీ రీసెర్చ్ సెంటర్ (పి పి ఆర్ సి), ఏకాత్మ మానవదర్శన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ , ప్రభాత్ ప్రకాశన్ సహకారంతో నిర్వహించారు.
“ఏకాత్మతా మానవతావాదం” సిద్ధాంతంపై స్పష్టమైన అవగాహన, విశ్వ మానన స్ఫూర్తికి ఈ సిద్ధాంతంపై సందేశం ఇస్తారు. ఏంతో ఘనమైన చరిత్రను స్వంతం చేసుకున్న మన దేశం నుండి ఒక భారతీయుడి నూతన ఆలోచనలు విశ్వవ్యాప్తం కావడం భారతీయత గొప్పతనం. ఈ భారతీయత నిజమైన అభివృద్ధికి దోహదం చేయడంతో ప్రతి ఒక్కరి ఆకాంక్షకు అనుగుణమైన విశ్వ మానవతా సిద్ధాంతాలలో ఒకటైన వసుదైవ కుటుంబం స్ఫూర్తిని పరోక్షంగా ఈ సిద్ధాంతం సూచిస్తుంది.
More Stories
యోగా మానవతను పెంచే సామూహిక పక్రియ.. మోదీ
ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో ఏకాకిగా ఇరాన్
స్విస్ బ్యాంకుల్లో 18 శాతం తగ్గిన భారతీయుల డిపాజిట్లు